జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం మన దేశ ప్రధానికి రావడమంటేనే మనకెంతో గర్వకారణం, అలాంటి సదస్సుకి సంబంధించి సన్నాహాక సమావేశంలో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానం పలికితే, ఆ కార్యక్రమానికి వెళ్ళకపోవడమేంటి.? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది బీజేపీ. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిథి ఎన్వీ సుభాష్ పత్రికా ప్రకటనలో, కేసీయార్ పై మండిపడ్డారు. జీ20 సమావేశానికి హాజరు కాలేదంటే, అన్ని స్కామ్‌లలో వున్నందుకు కేసీయార్, మోడీకి మొహం చూపించే దమ్ము లేకనే.. అని భావించాల్సి వస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. మీ పాపం పండే రోజులు దగ్గరలోనే… ‘జీ20 సమావేశంలో పాల్గొంటే అక్కడికి వచ్చిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల ముందు మీ అవినీతి, మీ కుమార్తె అవినీతి బండారం బయటపడుతుందనే మీరు రాలేదు.. స్కామ్‌లు, దందాలూ చేసి వుండకపోతే, సమావేశానికి ధైర్యంగా హాజరై మీ నిజాయితీని నిరూపించుకునేవాళ్ళు కదా..’ అని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘బీజేపీ పాలనలో దేశంలో అవినీతి పరులపై ఉక్కుపాదం మోపుతున్నాం.. అది కేసీయార్‌కి గిట్టడంలేదు..’ అంటూ ఎన్వీ సుభాష్ వ్యాఖ్యానించారు.’లిక్కర్ స్కామ్‌లో నువ్వు, నీ కూతురి బాగోతం కూడా బయటపడిపోయిందనే ఆందోళనలో వున్నావ్..’ అంటూ కేసీయార్‌పై మండిపడ్డారాయన.