చలికాలంలో చర్మ సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. అదే విధంగా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు, బాధించడం ఒక ఎత్తైతే, చల్లటి వాతావరణంలో కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువ కావడం మరో ఎత్తు. ఈ సీజన్‌లో చాలా మందికి వెన్ను నొప్పి, నడుము నొప్పి, తుంటి కీలు, చేతులు, కాళ్ళలో నొప్పులు సంభవిస్తాయి. కొన్నిసార్లు ఈ నొప్పులు తీవ్రంగా బాధిస్తూ ఏ పని చేయనివ్వవు. ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి చలికాలం చాలా సున్నితమైన సీజన్. 30 ఏళ్లు పైబడిన వారు తరచుగా వెన్నునొప్పి, తుంటి నొప్పి గురించి ఫిర్యాదులు చేస్తారు. లేచి కూర్చోవడానికి, కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. Reasons for Winter Back Pain – చలికాలంలో వెన్ను నొప్పికి కారణాలు చలికాలంలో ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయో, ముందుగా కారణాన్ని గుర్తించడం ముఖ్యం. అప్పుడే వారు సరైన చికిత్స తీసుకోగలరు. గౌట్ గౌట్ అనేది ఆర్థరైటిస్ సమస్యకు సంబంధించిన ఒక సంక్లిష్ట పరిస్థితి. చలికాలంలో కీళ్లలో ఆకస్మికంగా నొప్పి, వాపు, ఎరుపు, సున్నితత్వం కలగవచ్చు. ఇది వెన్ను, వెన్ను, తుంటిలో నొప్పికి కూడా దారితీస్తుంది. కొన్నిసార్లు యూరిక్ ఆమ్లం పెరగటం వలన కూడా ఈ పరిస్థితి తలెత్తుతుంది. శారీరక శ్రమ తక్కువవటం నేటి జీవనశైలిలో ప్రజలు శారీరక శ్రమ అవసరాన్ని గుర్తించడం లేదు. శ్రమ లేకుండా ‘స్మార్ట్’ గా పనులు చేసుకుంటున్నారు. దీని కారణంగా కూడా ఒళ్ళు నొప్పులు, వెన్ను నొప్పులు కలుగుతాయి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం లేదా పడుకోవడం చేయకుండా శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి. ఉష్ణోగ్రతలో తగ్గుదల చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల శరీరంలోని రక్తనాళాలు, కండరాలు కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించి కీళ్ల కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతుంది.
ఈ కారణంగా, నడుము, కీళ్ళు, తుంటి నొప్పులు కలుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుకోవడం అవసరం. టెండినిటిస్ టెండినైటిస్ వలన కూడా చలికాలంలో నడుము, తుంటి నొప్పిని కలిగిస్తుంది. స్నాయువు అనేది ఎముకలను- కండరాలకు కలిపే కణజాలం. చల్లదనం లేదా గాయం కారణంగా స్నాయువులో వాపు కలుగుతుంది, ఇది నొప్పిని కలిగిస్తుంది. చలికాలంలో సాధారణ నొప్పులను నివారించే మార్గాలు యోగా లేదా వ్యాయామం చేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కండరాల దృఢత్వాన్ని తొలగిస్తుంది. శరీరానికి వార్మప్ ఇవ్వడం ద్వారా లోపలి నుంచి వెచ్చదనం కల్పించినట్లు అవుతుంది. ఒకేచోట నిశ్చలంగా ఉండకుండా శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి. స్ట్రెచింగ్ చేయాలి, మసాజ్ కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ తినాలి. గుడ్లు, నట్స్, చేపలు, ఆరోగ్యకరమైన సూప్‌లు తీసుకోవాలి. చలికాలంలో ఉదయం సూర్యకాంతి మేలు చేస్తుంది. శరీరానికి విటమిన్ డి అవసరం, ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అందుకే చలికాలంలో రోజూ ఉదయం 15 నుంచి 20 నిమిషాల పాటు తేలికపాటి ఎండలో కూర్చోవాలి. ఈ చిట్కాలు వెన్ను నొప్పి, శరీర నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నొప్పులు ఉంటే వైద్య సహాయం తప్పక తీసుకోవాలి.