UPDATES  

 వేసవిలో విద్యుత్ కొరతను అధిగమించేందుకుగాను కొత్త పరిశ్రమలకు అనుమతివ్వనున్నట్టు సమాచారం

వచ్చే ఎన్నికలే అజెండాగా ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఎన్నిలకు మరో 14 నెలల వ్యవధే ఉన్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలను సీఎం జగన్ మంత్రివర్గ సమావేశ వేదికగా తీసుకునే అవకాశముంది. అటు మంత్రులకు ముందస్తు ఎన్నికలపై కూడా కొంత ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిన తరుణంలో సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా బటన్ నొక్కుడుకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. చివరి ఏడాది కావడంతో పథకాలను సక్రమంగా అమలుచేసి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారు. మరోవైపు కేంద్రం ఆర్థిక ఆంక్షలు, ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బందులు తలెత్తడం, ఆర్థిక సంక్షోభం దిశకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడం వంటి పరిణామాల మధ్య కేబినెట్ భేటీ జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రం సహాయ నిరాకరణచేస్తే ముందస్తు తప్పదు అని మంత్రులకు జగన్ ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది.

AP Cabinet Meeting 2022 వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. గత సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశం హాట్ హాట్ గా జరగనుంది. ఎన్నికల సమీపిస్తున్న కొలదీ ఎలా ముందుకెళ్లాలో తెలియక జగన్ సర్కారు అంతర్మథనం పడుతోంది. ప్రధానంగా రాజధానుల తరలింపు, సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు, కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉంది. దీనికి జగన్ సర్కారే కారణమన్న అపవాదు ఉంది. అందుకే దీనిపై ఏదో నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమైంది. అందుకే దీనిని ప్రధాన అజెండాగా చేర్చుకొని చర్చించనున్నారు. అమరావతిపై సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, విశాఖలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు వంటివి చర్చకు వచ్చే అవకాశం ఉంది. డిసెంబరు నెలాఖరులో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేబినెట్ లో చర్చకు వచ్చిన అంశాలను ఆమోదించే అవకాశం ఉంది. మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ తో పాటు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభంపై మంత్రివర్గ సమావేశం స్పష్టతనిచ్చే అవకాశముంది. రాయలసీమలో ఉన్న పరిశ్రమలను జగన్ సర్కారు సాగనంపుతున్న విమర్శలను చెక్ చెప్పేందుకు దీనినే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మరో నాలుగు విద్యుత్ సంస్థల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

వేసవిలో విద్యుత్ కొరతను అధిగమించేందుకుగాను కొత్త పరిశ్రమలకు అనుమతివ్వనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. AP Cabinet Meeting 2022 ఎన్నికలకు సంబంధించి చివరి ఏడాది కావడంతో పక్కగా పథకాలు అమలుచేసి ప్రజల్లో సంతృప్తిని నిలుపుకోవాలని భావిస్తోంది. రైతుభరోసా, అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు వంటి పథకాలకు కేటాయింపులు చేయనున్నారు. వాటకి కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. వీలైనంత వరకూ ఎక్కువ కేటాయింపులు చేసి పథకాలు అందలేదన్న మాట రాకుండా చూసుకోవాలని జగన్ చూస్తున్నారు.. ఇప్పటివరకూ ఇచ్చింది ఒక ఎత్తు.. ఈ ఏడాది ఇవ్వబోయేది మరో ఎత్తు అని భావిస్తున్నారు. అందుకే ఏ కొరతా లేకుండా చూడాలని చూస్తున్నారు. కేబినెట్ భేటీ అనంతరం జగన్ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కొందరు మంత్రుల పనితీరు బాగాలేకపోవడంతో క్లాస్ తీసుకుంటారన్న ప్రచారమూ ఉంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, విపక్షల మధ్య పొత్తులు, కేంద్రం వ్యవహార శైలి చర్చకు వచ్చే అవకాశముంది. పార్టీకి, ప్రభుత్వానికి మైలేజ్ ఇచ్చే విషయాలపై మంత్రుల నుంచి అభిప్రాయాలు కోరే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ఏపీ కేబినెట్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !