తెలుగు రాష్ట్రాల చుట్టూ ఇప్పుడు జాతీయ రాజకీయాలు తిరుగుతున్నాయి. కేసీఆర్ తన బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడ్డారు. అయితే ముందుగా తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీ నుంచే నరుక్కు రావాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేసుకొని ఎదగాలని భావిస్తున్నారు. ఇందుకు ఢిల్లీ నాయకుల సాయం తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు. పక్కా స్కెచ్ తో ఢిల్లీ నాయకుల సాయంతో ప్లాన్ రూపొందించడంలో తలమునకలై ఉన్నారు. సంక్రాంతి తరువాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించాలని కేసీఆర్ చూస్తున్నారు. 2023 సెప్టెంబరులో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే.. ఆ ప్రభావం ఏపీ పై కన్వర్ట్ చేయాలన్న తలంపులో కేసీఆర్ ఉన్నారు. CM KCR- Chandrababu ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఖాయంగా తేలిపోయింది.
ఏపీ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు మద్దతుగా స్వాగత బ్యానర్లు వెలుస్తున్నాయి. అటు విజయవాడలో ఆఫీసు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూస్తున్నారు. సామాజికవర్గపరంగా, పూర్వాశ్రమం టీడీపీలో పనిచేసినప్పుడు ఆయనకు స్నేహవర్గం ఎక్కువ. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా పార్టీ బాధ్యతలను తలసానికి అప్పగించారు. గత ఎన్నికల్లో జగన్ కు ఫేవర్ చేయాలన్న తలంపుతో తలసానిని ప్రయోగించి కేసీఆర్ సక్సెస్ సాధించారు. ఇప్పడు అదే స్ఫూర్తితో మరోసారి తలసానినే బీఆర్ఎస్ రాజకీయ విస్తరణకు వాడుకుంటున్నారు. అయితే ఇప్పటికే తలసాని ఏపీ నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. గతంలో ఒక వెలుగు వెలిగి అవకాశాలు లేక వెనుకబడిన వారు.. రాజకీయంగా తెరమరుగైన వారిని సైతం లైమ్ లైట్ లోకి తీసుకొని పనిలో పడ్డారు. అటు ప్రధాన పార్టీల్లో అసంతృప్త వాదులను కలిసి చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. అక్కడ ఏ చిన్న అవకాశాన్ని కాషాయదళం జారవిడుచుకోని పరిస్థితి. అక్కడ చంద్రబాబు సాయం తీసుకోవడానికి బీజేపీ సిద్ధపడుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అందుకే ఏపీలో చంద్రబాబును ఆత్మరక్షణలో నెట్టేయ్యడానికి పావులు కదుపుతున్నారు. ఇందుకు తన బీఆర్ఎస్ ఒక్కదానితో కాదని కేసీఆర్ డిసైడ్ అయినట్టున్నారు.
అందుకే ఢిల్లీ లోని అమ్ అద్మీ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. అటు కేజ్రీవాల్ సైతం ఏపీలో తన పార్టీని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన కేసీఆర్ తో చేయి కలిపేందుకు డిసైడ్ అయ్యారు. అటు తెలంగాణలో సైతం ఆప్ కు చోటిచ్చి.. ఏపీలో కూడా కలిసి పోటీచేసేలా కేసీఆర్, కేజ్రీవాల్ మధ్య ఒప్పందం కుదిరింది. CM KCR- Chandrababu ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు,మెజార్టీ ఓటింగ్ వర్గాలు తమకు అనుకూలంగా ఉంటాయని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాలుదక్కని వారు, ప్రభుత్వ బాధిత వర్గాలు, ఎగువ మధ్యతరగతి వర్గాలు తమకు అండగా నిలుస్తాయని టీడీపీ భావిస్తోంది. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని పవన్ చెబుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకిస్తున్నా.. టీడీపీకి ఓటు వేసేందుకు ఇష్టపడని వర్గాలు ఉన్నాయి. అటువంటి వారిని కేజ్రీవాల్ రూపంలో ఆకట్టుకుంటే వర్కవుట్ అవుతుందని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. తాను ముందుంటే ఏపీ ప్రజలు ఆదరించే స్థితి లేదని గ్రహించిన కేసీఆర్ కేజ్రీవాల్ ను తెరపైకి తెచ్చారు. ఆయన చరిష్మ ద్వారా బీఆర్ఎస్ ను ఏపీలో ఎంట్రీ చేయవచ్చని భావిస్తున్నారు. తద్వారా తెలంగాణలో తన ప్రత్యర్థి బీజేపీతో చేతులు కలిపిన చంద్రబాబును దెబ్బతీయవచ్చని కేసీఆర్ నమ్మకంగా చెబుతున్నారు. అటు తన మిత్రుడు జగన్ ను కొంతవరకూ సేవ్ చేయవచ్చని ఆలోచన చేస్తున్నారు. టీడీపీని ఇరుకున పెట్టి వైసీపీకి మేలు చేయాలన్న తలంపుతో ముందుకెళ్లున్న కేసీఆర్ ఆలోచన వర్కవుట్ అవుతుందో? లేదో? చూడాలి మరీ.