UPDATES  

 టాలీవుడ్ దిగ్గజాలకు TANA సన్మానం.. ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు

ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారి కోసం ఏర్పాటైన సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం(Telugu Association of North America-TANA). సింపుల్‌గా చెప్పాలంటే తానా. ప్రతి ఏటా తానా సభలు మూడు రోజుల పాటు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం ప్రత్యేకంగా వారు చేసే కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లోన జరుపుకోవాలని సుమారు రూ.10 కోట్ల పెట్టుబడితో డిసెంబరు 2 నుంచి జనవరి 4 వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు తానా కళారాధన పేరిట తెలుగు చలనచిత్రం రంగంలో విశేష కృతి చేసిన ప్రముఖులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమా ప్రముఖులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తానా వారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలను సన్మానించడం ఎంతో అభినందనీయమని స్పష్టం చేశారు. “కళామాతల్లి ముద్దుబిడ్డలైన కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్, గిరిబాబు, గాయని సుశీల, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కోదండరామిరెడ్డి లాంటి వారిని ఇక్కడకు రప్పించి వారిని సత్కరించడం చూస్తుంటే తానా వారు కళారంగానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో ఈ సభను చూస్తే అర్థమవుతుంది. మాతృమూర్తిని, మాతృ భాషను, ఉన్న ఊరిని, గురువులను ఎన్నటికీ మరువరాదు. తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా అమెరికాలో తెలుగు వెలుగొందుతుంది. మాతృ భాష అభివృద్ధి కోసం ప్రవాసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక్కడున్న తెలుగువారిని ఆదర్శంంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ సందర్భంగా అమ్మ భాషను మరిచిపోరాదని, మాతృభాషలో చదవడం వల్ల ఉన్నత పదవులు రావనే భావన వద్దని స్పష్టం చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన నాయ్యమూర్తి ఎన్వీ రమణ సహా మాతృభాషలోనే చదువుకుని ఉన్నత పదవులను చేపట్టిన విషయాన్ని ఉదహరించారు. ఈ కార్యక్రమంలో అలనాటి సినీ నటి కృష్ణ వేణి, నటులు కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్, గిరిబాబు, గాయని సునీళ, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మానందం, దర్శకడు కోదండరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. వీరందరినీ తానా నిర్వాహకులు సత్కరించారు. 1978లో తానా సంస్థ ఏర్పడింది. అప్పటి నుంచి ఏటా తానా సభలు వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !