కర్నాటక మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి టాటా చెప్పేశారు. గత కొంతకాలంగా ఆ పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ వచ్చిన ఆయన చివరకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఉన్న బీజేపీకి ఆయన రాజీనామా చేయడం ఇపుడు కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పైగా కొత్త పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు.
కొంతకాలంగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న గాలి జనార్థన్ రెడ్డి… ఆదివారం తన నివాసం పారిజాతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఆయన కళ్యాణ్ రాజ్య ప్రగతి పక్ష అనే పేరుతో కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై సొంత పార్టీతో రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని తెలిపారు. బీజేపీతో తన బంధం ముగిసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తానని, కర్నాటక ప్రజల హృదయాలను గెలుచుకుంటానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.