UPDATES  

 శీతాకాలంలో తరచుగా వాతావరణ మార్పులు

ఈ శీతాకాలంలో తరచుగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తుఫాన్ల ప్రభావంతో కొన్నిసార్లు మబ్బుపట్టి, ఈదర గాలులు వీస్తుండడం వల్ల వృద్ధులు, చిన్నారులపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వెంటాడుతున్నాయి. వివిధ దేశాల్లో కోవిడ్ సంక్రమణ విజృంభిస్తుండడంతో ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చినా భయాందోళన నెలకొంటోంది. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. వైరల్ ఫీవర్ లక్షణాలు ఇవే.. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు పలు లక్షణాలు కనిపిస్తాయి. బాడీ టెంపరేచర్ 99 ఫారెన్‌హీట్ డిగ్రీల నుంచి 103 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత ఉంటుంది. వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు సాధారణ జలుబు, దగ్గు, తలనొప్పి, చలి, వణుకు, డీహైడ్రేషన్, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. వైరల్ ఫీవర్ ఎందుకొస్తుంది? ఇన్ఫెక్షన్, వైరస్ వల్ల వైరల్ ఫీవర్ వస్తుంది. ఇన్ఫెక్షన్ కారకమైన వైరస్‌తో శరీరం పోరాడినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. మీకు సమీపంలో వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారు ఉన్నప్పుడు మీకు కూడా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంటుంది. వారి దగ్గినా, తుమ్మినా మీరు శ్వాస పీల్చుకున్నప్పుడు వైరస్ మీకు సోకుతుంది. జలుబు, ఫ్లూ జ్వరం వంటివి ఇలాగే వస్తాయి.

ఆహారం, పానీయాల ద్వారా కూడా వైరస్ సంక్రమిస్తుంది. నోరోవైరస్, ఎంటెరోవైరస్ ఇలాంటివే. అంతేకాకుండా క్రిమికీటకాలు కుట్టినప్పుడు కూడా వాటి ద్వారా మన శరీరంలో ఇన్ఫెక్షన్ తయారవుతుంది. డెంగ్యూ, రేబీస్ వంటివి ఇలాంటివే. వైరల్ ఫీవర్ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చా? శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్లైనా, బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లయినా దాదాపు ఒకే తరహా లక్షణాలు చూపుతాయి. మీ లక్షణాలను బట్టి వైద్యులు అవి వైరల్ ఇన్ఫెక్షన్లా, లేక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లా కనిపెడతారు. లేదంటా రక్త పరీక్షలు సిఫారసు చేస్తారు. గొంతు నొప్పి ఉందా? ప్రశ్నిస్తారు. తెల్ల రక్త కణాల సంఖ్యను బట్టి వైరల్ ఇన్ఫెక్షన్ నిర్ధారిస్తారు. వైరల్ ఫీవర్ చికిత్స ఏంటి? సాధారణంగా ఎక్కువ శాతం కేసుల్లో వైరల్ ఇన్ఫెక్షన్లకు నిర్ధిష్టమైన చికిత్స ఉండదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లయితే యాంటీబయాటిక్స్‌కు లొంగుతాయి. కానీ వైరల్ ఇన్ఫెక్షన్లకు అవి పనిచేయవు. అందువల్ల వైద్యులు లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. జ్వరానికి, జలుబు, దగ్గుకు తగిన మందులు ఇస్తారు. అలాగే శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు, పండ్ల రసాలు తీసుకోమని చెబుతారు. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు చల్లగా లేని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? వైరల్ ఫీవర్‌లో ఒక్కోసారి అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందువల్ల జ్వరం 103 దాటినప్పుడు తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మేలు. చిన్నారులైతే 100 డిగ్రీల జ్వరం పైబడి ఉంటే కూడా వైద్యుడిని సంప్రదించడం మేలు. జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, చాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, దద్దుర్లు వంటి వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది. కాలం ఏదైనా, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడానికి మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడం అవసరం. వైరస్‌ను, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను తట్టుకునేలా ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకోవడం మేలు చేస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !