చలికాలంలో చర్మం పొడిబారడం, పెదవులు పగలడం వంటివి చాలా సాధారణం. అయితే మీ పెదాలను మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి లిప్ బామ్‌లు గొప్ప మార్గం.
మార్కెట్లో మనకు చాలా రకాల లిప్ బామ్‌లు అందుబాటులో ఉంటాయి, కొందరు ఖరీదైన లిప్ బామ్‌లు కూడా ఉపయోగిస్తారు. అయినప్పటికీ వీటితో తాత్కాలిక ప్రయోజనం లభిస్తుంది కానీ, ఇతర దుష్ప్రభావాలు ఉంటాయి. పెదాలు నల్లగా, నిర్జీవంగా మారటానికి ఈ లిప్ బామ్‌లు కూడా ఒక కారణం. ఆదర్శవంతమైన లిప్ బామ్‌లు పెదవులకు పోషణను అందించాలి, కఠిన వాతావరణ పరిస్థితులు, హానికరమైన సూర్య కిరణాల నుండి రక్షించాలి.
మీరు లిప్ బామ్‌లలో ఉపయోగించే పదార్థాల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే DIY ఇంట్లో తయారుచేసిన లిప్ బామ్‌లు అనువైనవి. . ఈ DIY లిప్ బామ్‌లు మీ పెదాల సంరక్షణకు అవసరమయ్యే పోషణ ఇస్తాయి, మీకు అందమైన పెదవులను, ఆకర్షణీయమైన నవ్వును అందించడంలో సహాయపడతాయి.
మీ వంటగదిలో లభించే పదార్థాలను ఉపయోగించి మీకు మీరుగా ఎప్పుడు కావాలన్నా, సులభంగా ఈ Homemade లిప్ బామ్‌లను తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి, మీ స్నేహితులకు బహుమతులుగా కూడా ఇవ్వవచ్చు. మరి లిప్ బామ్‌లను ఎలా తయారు చేయవచ్చో ఇక్కడ రెండు రెసిపీలు అందించాం, కింద ఇచ్చిన సూచనల ఆధారంగా మీరు లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు.
మొదటగా, గులాబీ పెదవులు పొందేందుకు బీట్‌రూట్ లిప్ బామ్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
DIY Beetroot Lip Balm
కావలసిన పదార్థాలు
1 బీట్‌రూట్
2 టీస్పూన్లు కొబ్బరి నూనె
1-2 విటమిన్- ఇ నూనె క్యాప్సుల్స్
1 టీస్పూన్ పెట్రోలియం జెల్లీ
ఎలా చేయాలి?
దీన్ని చేయడానికి, ముందుగా బీట్‌రూట్‌ను బాగా ఉడకబెట్టండి. తర్వాత దాని తొక్క తీసి ముక్కలుగా కోయండి. లేదా బీట్‌రూట్ పొడిని కూడా ఉపయోగించవచ్చు.
ఇప్పుడు బీట్‌రూట్‌ను ముక్కలను రుబ్బి, ఫిల్టర్ చేసి దాని రసాన్ని ఒక గ్లాసులోకి తీసుకోండి. అందులో సమానమైన పాళ్లలో కొబ్బరినూనె వేసి బాగా కలిపి కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.
చల్లబడ్డాక ఫ్రిజ్ నుండి తీసివేసి, దానిలో పెట్రోలియం జెల్లీ వేసి, విటమిన్ ఇ ఆయిల్ కలపండి. మిశ్రమం స్థిరంగా, మందంగా తయారయ్యేలా కలపాలి.
అంతే బీట్‌రూట్ లిప్ బామ్ రెడీ, స్టోర్ చేసుకొని వాడుకోవడమే.
DIY Chocolate Lip Balm
కావలసిన పదార్థాలు
2 టీస్పూన్లు బీస్ వాక్స్ గుళికలు
1 టీస్పూన్ కోకో పౌడర్
2 టీస్పూన్లు బాదం నూనె
కొన్ని చుక్కలు పిప్పరమెంటు నూనె
తయారీ విధానం
ముందుగా మైక్రోవేవ్ లేదా స్టవ్‌లో డబుల్ బాయిలర్ ఉపయోగించి తెల్లటి మైనపు గుళికలను కరిగించండి.
అనంతరం కోకో పౌడర్ వేసి బాగా కలిసిపోయేలా కలపండి.
కలుపుతున్న సమయంలో స్వీట్ బాదం నూనె, పిప్పరమెంటు నూనె వేయండి.
ఆపైన చల్లబరిచి, చిన్న కంటైనర్లలో నిల్వచేయండి.
అంతే చాక్లెట్ లిప్ బామ్ రెడీ. ఇది రాసుకుంటే మీ పెదాలను మీరే ముద్దు పెట్టుకోవాలనిపించేంత అందంగా తయారవుతాయి.