UPDATES  

 జనవరి 1 నుంచి పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి

ఏపీలో పెంచిన పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. జనవరి 1 నుంచి పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పింఛన్ కింద రూ. 2,750 ని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లే అందజేయనుంది. 2022 జూలై నుంచి నవంబర్ మధ్య పింఛన్, రేషన్, ఆరోగ్య శ్రీ పథకాలకు ఎంపికైన వారికి ఆదివారం నుంచే వాటిని అందించనుంది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది. జనవరి 1 నుంచే 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు పెన్షన్ కానుక వారోత్సవాలు సైతం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా… జనవరి 3న రాజమండ్రిలో జరిగే పెన్షన్ వారోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట.. అవ్వా తాతలు, వితంతువులు, చేనేత, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రూ. 1000 గా ఉన్న పింఛన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. రూ. 2,250 కి పెంచింది. ఏటా పెంచుతూ.. రూ. 3 వేల వరకు ఇస్తామన్న వాగ్దానం మేరకు.. 2022 రూ. 2,500 కి పెంచారు. తాజాగా.. 2023 జనవరి 1 నుంచి రూ. రూ. 2,750 కి పెంచి పంపిణీ చేయనున్నారు.

అలాగే.. కొత్తగా మరో 2,31,989 మందికి పెన్షన్లు మంజూరు చేశారు. దీంతో… ఈ పథకం కింద ప్రతి నెలా ప్రభుత్వం నుంచి పింఛన్లు అందుకుంటున్న వారి సంఖ్య 64,06,240 కు చేరింది. దీనికై ఏటా చేయనున్న వ్యయం రూ. 21,180 కోట్లు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పింఛన్లపై చేసిన మొత్తం ఖర్చు రూ. 62,500 కోట్లని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే.. కొత్త లబ్ధిదారులతో కలిపి… జనవరి 1 నాటికి.. బియ్యం కార్డుల లబ్దిదారుల సంఖ్య 1,45,88,539… ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య 1,41,48,249… ఇళ్ల పట్టాలు అందుకున్న వారి సంఖ్య 30,29,171 కు చేరిందని అధికారులు వెల్లడించారు. ప్రతి నెలా మొదటి రోజే, అది ఆదివారమైనా, సెలవుదినమైనా లబ్దిదారుల గడప ముందుకొచ్చి ఠంచనుగా పింఛన్ అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలోలా చాంతాడంత క్యూలలో వృద్ధులు, దివ్యాంగులు నిలబడే అవస్ధలు లేవని…. ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన పనిలేదని పేర్కొంది. ఒకవేళ పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని… వారే దగ్గర ఉండి చేయి పట్టుకుని నడిపించి పెన్షన్‌ అందే విధంగా సాయం చేస్తారని వివరించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !