ఏపీలో జనసేన దూకుడు పెంచింది. అధికార పక్షం పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అదును చూసుకుని జగన్ ప్రభుత్వం పై విమర్శల దాడి చేస్తోంది. వైజాగ్ పర్యటన మొదలుకొని ఇప్పటం పర్యటన వరకు అధికార పక్షాన్ని టార్గెట్ చేసింది. రాజధాని సమస్య మొదలుకొని రోడ్ల సమస్య వరకు జగన్ పాలన పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. జనసేనాని దూకుడు ప్రధాన స్రవంతి మీడియా దృష్టిని ఆకర్షించింది. అప్పటి వరకు సీన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కాస్త తెర మరుగైంది. వైసీపీ, జనసేన రెండూ నువ్వా నేనా అన్నట్టు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ, జనసేనలు పోటీపడుతున్నాయి. రాజకీయ అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జనసేన ప్రభావం ఎంత ?. ముఖ్యంగా రాయలసీమలో జనసేన రాణించగలదా ? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. 2014 ఎన్నికల్లో జనసేన పోటీలో నిలబడకపోయినప్పటికీ.. టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చింది. అనంతరం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ.. సమస్యల ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కేవలం రాజోలు నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. ఓటమికి కుంగిపోకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. జనసేన బలం ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు.
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాల్ని రూపొందిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా పార్టీ కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో మీడియా అటెన్షన్ తమపై ఉండేలా చూసుకుంటున్నారు. కోస్తా ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో జనసేన ప్రభావం బలంగా ఉంటుంది. కాపులు అధికంగా ఉన్న చోట జనసేనకు గ్రామస్థాయి కేడర్ ఉంది. 2019 ఎన్నికల్లో ఒక స్థానంలోనే గెలిచినప్పటికీ, చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమికి జనసేన పరోక్షంగా కారణమైంది. అది కూడా కోస్తా ప్రాంతంలోనే టీడీపీ గెలుపును దెబ్బతీసింది. 2019 ఎన్నికల్లో జరిగిన తప్పు పునరావృతం కాకూడదని జనసేన భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటన చేశారు. కోస్తా ప్రాంతం వరకు జనసేన ప్రభావం కొద్దిగా ఉన్నప్పటికీ.. రాయలసీమలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. పవన్ అభిమానులు, కాపు ఓటర్లు ఉన్నప్పటికీ చాలా నియోజకవర్గాల్లో జనసేన ఇన్ చార్జ్ లు లేరు. కనీసం పార్టీ పిలుపునకు స్పందించి కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా అది కూడా నామమాత్రమే. ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో జనసేన పరిస్థితి ఒకలా ఉంటే, రాయలసీమలో మరొకలా ఉంది. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2019 ఎన్నికల్లో వైసీపీ 49 గెలిచింది. టీడీపీ మూడు స్థానాలు గెలిచింది. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. సైకిల్ చక్రానికి ఫ్యాన్ గాలి తీసిందనే చెప్పుకోవాలి. ఒకప్పుడు అనంతపురంలో టీడీపీ బలంగా ఉండేది అలాంటి ప్రాంతంలో కూడ వైసీపీకి 14 స్థానాలకు గాను 12 స్థానాలు గెలుచుకుంది. ఇక జనసేన నియోజకవర్గానికి నాలుగైదు వేల ఓట్లతో సరిపెట్టుకుంది. కొన్ని నియోజకవర్గాల్లో అవి కూడ రాలేదు. ఎన్నికల అనంతరం రాయలసీమలో జనసేన పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించింది లేదు. రాయలసీమలో కరువు యాత్ర చేస్తానన్న పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేసి జనసేనను సీమలో బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. పవన్ ‘వారాహి’ బస్సు యాత్రను రాయలసీమలోని తిరుపతి నుంచే మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక పవన్ ఈసారి తిరుపతి నుంచే బరిలోకి దిగుతుండడం కూడా జనసేనకు ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. పవన్ ఇక్కడి నుంచి పోటీచేస్తే పార్టీ కార్యకర్తలకు కొండంత బలం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే చిరంజీవి తిరుపతిలో గెలిచారు. ఇక్కడి వారు ఆదరించారు. ఇప్పుడు పవన్ కూడా అదే పనిచేయబోతున్నారు. పార్టీ కార్యక్రమాలను సీమలో విస్తృత పరిచేందుకు పవన్ యోచిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజాపోరాటాలను సీమ నుంచే నిర్వహించడానికి ఈ మధ్య పర్యటనలు పెంచారు.