UPDATES  

 ఎంత ఆత్రుత పడినా భవిష్యత్తు నిర్ణయించలేరు..

గతం అంటే ఇప్పటికే జరిగిపోయిందని అర్థం. దానిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది గతంలో చేసిన తప్పుల గురించే ఆలోచిస్తూ.. తాము తప్పు చేశామని కృంగిపోతూ ఉంటారు. మీరు ప్రస్తుతం ఎంత అపరాధంగా ఫీల్ అవుతున్నా.. గతాన్ని ఏమాత్రం మార్చలేరు. ఆ జ్ఞాపకాల తాలుకూ బాధను మరింత పెంచుకోవడం తప్పా.. మీ అపరాధభావం కొంచెం కూడా.. గతంలో జరిగిన తప్పును మార్చదు. మీరు ఏమి చేసినా.. దానిపై ఎంత సమయాన్ని వృథా చేసినా.. కొంచెం కూడా ఏమి మారదు. అలా జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు కూడా మీరే దోషిగా భావిస్తుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మీరు అనుభవించిన సంఘటనలను మీ అపరాధం ఎప్పటికీ మార్చదు. మరోవిషయమేమిటంటే.. ఇప్పుడెంత ఆలోచించినా.. గడిచిపోయిన రోజులను తిరిగి పొందలేము. పోయినది ఎలాగో మన చేతుల్లో లేదు. ఈ కఠినమైన చేదు నిజాన్ని.. మీరు ఒప్పుకుని తీరాల్సిందే. జీవిత వాస్తవికత నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. గతం గురించి బాధపడుతూనే ఉంటే.. అది మిమ్మల్ని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వదు. సరి కదా రోజు రోజుకి మీలోని అపరాధభావం మిమ్మల్ని నిలువునా దహించేస్తూ ఉంటుంది.

ఏది ఏమైనా జీవితం ఆ రోజులను తిరిగి ఇవ్వదని మనమే అర్థం చేసుకోవాలి. గతాన్ని మార్చలేము అనే చేదు నిజాన్ని అంగీకరించాలి. అక్కడితోనే దానిని వదిలివేయాలి. ఎందుకంటే మనకు వేరే ప్రత్యామ్నాయమేమి లేదు. అలాగే మనలో ఎవరూ భవిష్యత్తును చూడలేము. ఎప్పుడూ ఎలా ఉంటుందో తెలియని భవిష్యత్తు గురించి ఆలోచన ఉండడం మంచిదే కానీ.. ఆందోళన ఎప్పుడూ లేకుండా చూసుకోండి. ఆందోళన మనల్ని వెనక్కి లాగుతుందే తప్పా.. ముందుకు వెళ్లనీయదు. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అలా తెలిస్తే.. అందరూ అంబానీలు అయిపోతారు. ఎప్పుడూ ఏమవుతుందో తెలియని రోజు కోసం అనవసరంగా ఆందోళన పడకండి. మనం ఎంత ఆత్రుతగా ఉన్నా, భవిష్యత్తును ఏదీ మార్చదు. మనం ఎంత ఆలోచించినా అది మన చేతుల్లో లేదని అర్థం చేసుకోవాలి. ఏది జరగాలో అదే జరుగుతుంది. మనం అంగీకరించాలి. భవిష్యత్తును మెరుగ్గా చేసుకోగలం కానీ.. దానిని మనం డిసైడ్ చేయలేము. మన చేతుల్లో గతం లేదు, భవిష్యత్తు లేదు. ప్రస్తుతం మాత్రమే మన సొంతం. ఈ పూట, ఈ క్షణం మనం ఎలా ఉన్నాము.. ఏమి చేస్తున్నామన్నదే ముఖ్యం. నిజమే జీవితం సులభం కాదు. వెంటాడే గతం.. ఎదురయ్యే భవిష్యత్తు రెండూ మనల్ని ఆందోళనకి గురిచేస్తాయి. అందుకే వాస్తవానికి ఎప్పుడూ దగ్గరగా ఉండండి. మన నియంత్రణలో లేని ఈ రెండిటి గురించి ఆందోళన పడకండి. వర్తమానంలో ఉండండి. మీరు చేసే పనిలో మీ బెస్ట్ ఇవ్వండి. తద్వారా మీరు తర్వాత చింతించాల్సిన అవసరం ఉండదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !