UPDATES  

 సీఎం కేసీఆర్ సభ సక్సెస్ పట్ల కలెక్టర్ అనుదీప్ హర్షం

మన్యం న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు భవనం అంగరంగ వైభవంగా ప్రారంభించుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ గురువారంహర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జడ్పి చైర్మన్ తదితర ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్ డా శాంతి కుమారి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరు కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆసాంతం దిగ్విజయంగా నిర్వహించుటలో సహకరించిన జిల్లా ప్రజా ప్రతినిధులకు, పాత్రికేయులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు అనధికారులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నూతన కలెక్టరేట్ భవనం అద్భుతంగా నిర్మించుకున్నారని ఎటుచూసినా పచ్చని వాతావరణ కనిపిస్తుందని సీఎం అభినందించడం చాలా సంతోషమని చెప్పారు. గురువారం నుండి అన్ని శాఖలు ఒకే సముదాయంలోకి రానున్నాయని, తద్వారా జిల్లా ప్రజలకు సుపరిపాలన అందుబాటులోకి రానున్నదని చెప్పారు. అన్ని శాఖలు ఒకే సముదాయంలో ఉండటం వల్ల ప్రజలకు సేవలు మరింత చేరువ కానున్నాయని చెప్పారు. ప్రజలకు కూడా ఎంతో సౌలభ్యత ఉంటుందని, గతంలో వేరు వేరు చోట ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వల్ల ప్రజలు అన్ని శాఖలకు తిరగాల్సిన పరిస్థితి ఉండేదని నేడు అటువంటి అవసరం లేకుండా ఒకే సముదాయంలో ఉన్నందున వారి సమస్యలు పరిష్కరించడానికి సులువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించడానికి అవకాశం కలుగుతుందని జిల్లా ప్రజలకు కూడా ఎంతో సౌకర్యం ఉంటుందని తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే జిల్లా అధికారుల నివాస స్థలాలు కూడా నిర్మించుకున్నామని, జిల్లా అధికారులు నిరంతరం అందుబాటులో ఉండే అవకాశం ఉన్నదని ఇది ప్రజలకు ఎంతో అనుకూలతగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి అధునాతన అంగులతో సువిశాలమైనటువంటి భవనంతో పాటు పచ్చని చెట్లు, పూలవనంతో నిండి ఉన్నటువంటి కలెక్టరేట్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !