మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 21…
కంటి వెలుగు ప్రత్యేక క్యాంపులు నిర్వహణకు కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాంతి కుమారి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాలు నిర్వహణ బావుందని అభినందించారు. అనంతరం వైద్య, పంచాయతీ అధికారులతో కంటి వెలుగు క్యాంపులు, క్యాంపుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వాహణ తదితర కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాల నిర్వహణలో ఏమైనా సమస్యలు వస్తే అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని చెప్పారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని, భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు జరిగే కంటి వెలుగు కార్యక్రమాలలో ప్రజలకు విస్తృతమైన సేవలు అందించాలని కోరారు. కంటి వెలుగు కాంపులు నిర్వహణలో క్వాలిటీ అధికారులు గుర్తించిన సమస్యలను తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో గత రెండు రోజులుగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాల్లో 12, 235 మందిని పరీక్షించారని, వారిలో రీడింగ్ సమస్య ఉన్న 4522 మందికి వెంటనే కంటి అద్దాలు అందచేసినట్లు చెప్పారు. 1879 మందికి ప్రత్యేకంగా కళ్ళ జోళ్ళకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. కంటి వెలుగు కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ బావుందని ఇలాగే కొనసాగించాలని పంచాయతీ, మున్సిపల్ అదికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, జిల్లా పంచాయతీ అధికారి రమకాంత్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
