మా గోడు వినండి సారు…. సమస్యల పరిష్కారం కోరుతూ
బయ్యారం టు భద్రాద్రి
విద్యార్థుల పాదయాత్ర
అకారణంగా తొలగించిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలి
ఐటీడీఏ పీవో వెంటనే స్పందించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాదయాత్ర
మన్యం న్యూస్, పినపాక, జనవరి 22
మండల పరిధిలోని ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర మొత్తం ఉలిక్కిపడే విధంగా వినూత్న కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఆశ్రమ పాఠశాల నుంచి బయలుదేరి భద్రాచలం ఐటిడిఏ పిఓ కు తమ సమస్యలను తెలియజేయాలని కాలినడకగా బయలుదేరారు. చాలా రోజుల నుంచి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు లేవని, భోజన ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఆహార మెనూ కు సంబంధించిన చార్జీలను ఇంతవరకు ఇవ్వలేదని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని పాదయాత్ర చేస్తున్నామని తెలియజేశారు. వీరి పాదయాత్రకు ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతు గా నిలబడి, వారితోపాటు భద్రాద్రి కి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలలో భోజన వసతి సరిగా లేదని, విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలియజేశారు. అంతేకాకుండా ఇటీవల అమాయకులైన ఉపాధ్యాయులను విధుల నుండి బహిష్కరించి విద్యార్థులను చదువు నుంచి దూరం చేశారు. ఏటీడీఓ ఉపాధ్యాయుల గురించి తప్పుడు నివేదిక సమర్పించి, వారి బహిష్కరణకు కారణమయ్యాడని, అతనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పాదయాత్రతోనైనా అధికారులకు కనువిప్పు కలగాలని, అందుకే ఈ విధంగా చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటికైనా ఐటీడీఏ పీవో స్పందించి విద్యార్థుల సమస్యలకు పూర్తి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.