దొంగల ఆట కట్టిస్తాం
*వరుస దొంగతనాల నివారణ చర్యలపై గ్రామ ప్రజలకు అవగాహన సమావేశం
*ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం
*మొండికుంట లో పొలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేస్తాం: డిఎస్పి రాఘవేంద్రరావు
మన్యం న్యూస్,అశ్వాపురం: మండలంలోని మొండికుంటలో జరుగుతున్న వరుస దొంగతనాలపై మణుగూరు సబ్ డివిజన్ పోలీసులు నజర్ పెట్టారు. వారి భరతం పడతామని మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు తీవ్రహెచ్చరికలు జారీ చేశారు. ఆయన శుక్రవారం మండల పరిధిలోని మొండికుంట లో పాత గ్రామపంచాయతీ దగ్గర వరుస దొంగతనాలు వాటి నివారణ పై సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి రాఘవేంద్రరావు మాట్లాడుతూ మొండికుంట గ్రామంలో వరుస దొంగతనాలు జరగడం బాధాకరమన్నారు. యువత వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల దినచర్యను ప్రతిరోజు గమనించాలని, చెడు మార్గంలో వెళ్లినట్లు గమనించినట్లయితే కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. కాగా గ్రామంలో దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఒక సీసీ కెమెరా 100 మందికి సమానంగా పనిచేస్తుందన్నారు. తద్వారా దొంగతనాలను నివారించవచ్చునని ఆయన సూచించారు. మొండికుంటలో ప్రత్యేక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని డిఎస్పి ఈ సందర్భంగా వెల్లడించారు. తద్వారా దొంగతనాలను నివారించవచ్చునని ఆయన అన్నారు. ఈ సమావేశంలో
అశ్వాపురం సిఐ శ్రీనివాస్ ,ఎస్ఐ జితేందర్, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు ప్రజలు యువత పాల్గొన్నారు.