మన్యం న్యూస్, పినపాక, జనవరి 28
పినపాకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో కోటి 56 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే రేగా కాంతారావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమ అనంతరం ఆసుపత్రి సిబ్బందితో ముచ్చటించారు. సిబ్బంది ఆరోగ్య వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించవచ్చునని తెలియజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ, ఆసుపత్రికి సంబంధించిన సమావేశాల ఏర్పాటుకు సరైన గదులు లేక చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, సమావేశ మందిరం ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ, నూతనంగా నిర్మించబోయే ఆసుపత్రి పూర్తయిన తర్వాత, ఆసుపత్రి పై భాగంలో ప్రత్యేక నిధులతో సమావేశ మందిరం ఏర్పాటు చేయించే బాధ్యత నాదే అని తెలియజేశారు. ఆయన నిర్ణయం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.