మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 28… ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని పంచాల్సిన పల్లె ప్రకృతి వనం అధికారులు నిర్లక్ష్యంతో వికృతి రూపం దాల్చింది. పచ్చని మొక్కలతో స్వాగతించాల్సిన ఆ వనములో పందులు సంచరించాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధి పరచటంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారు.. దీంతో సమస్యలను వెలికితీస్తూ మన్యం న్యూస్ దినపత్రికలో “ఆహ్లాదం మాయం అపరి శుభ్రతకు నిలయం” అనే కథనాన్ని ప్రచురించడం జరిగింది. దీంతో శనివారం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పంచాయతీకి చెందిన ఈవో బాబురావు, మండల పంచాయతీ అధికారి గుంటి సత్యనారాయణ తన పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి రాంనగర్ ప్రాంతంలో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని శుభ్రపరిచారు. అంతేగాకుండా ఆ పల్లె ప్రకృతి వనంలో పందులు సంచరించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆ ప్రకృతి వనంలో ఓ వ్యక్తి కొంత స్థలాన్ని ఆక్రమించి మెట్లు కట్టడంతో తక్షణమే వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా పంచాయతీ నిబంధనలను అతిక్రమించినందుకు సదరు వ్యక్తికి రూ 20 వేల రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు ఈవో బాబురావు మన్యం న్యూస్ కి తెలిపారు. ఇప్పటికే విద్య నగర్ పంచాయతీ తరపున ఆ వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.