సమైక్యత, సహనంతో కూడిన దేశాన్ని నిర్మించుకుందాం
విద్వేశాలు సృష్టించి పబ్బంగడుపుకునే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కార్పోరేట్ల పరమవుతున్న జాతీయ సంపదను సమిష్టి ఉద్యమాలతో కాపాడుకుందాం
పంచాయతీల స్థాయి ప్రజాచైతన్య సదస్సుల్లో కూనంనేని
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 30 …సమైక్యత, సహనంతో కూడిడి దేశాన్ని నిర్మించుకునేందుకు ప్రతిఒక్కరు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, అప్పుడే నాటి మహానీయుల ఆశయాలను నెరవేర్చినవారమవుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మి దేవిపల్లి మండల పరిధిలోని అశోకనగర్ కాలనీ, ఎదురుగడ్డ గ్రామ పంచాయతీల స్థాయి ప్రజాచైతన్య సదస్సులు ఆయా పంచాయతీ కేంద్రాలలో జరిగాయి. సదస్సులకు ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ బిజెపి, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ వంటి సంస్థలు ప్రజలమధ్య మతంపేరుతో విద్వేశాలు రెచ్చగొట్టి పబ్బంగడుపుకునే కుట్రలకు పాల్పడుతున్నాయని, ఇలాంటి మతోన్మాద శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు చెందాల్సిన జాతీయ సంపదను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతోందని, దేశాన్ని లూటీ చేస్తున్న కేంద్ర సర్కార్ చర్యలను ప్రతిఘటించకపోతే భవిష్యత్తు తరాలు మనను క్షమించబోమన్నారు. ఎందరో త్యాగదనులు, మహాత్ముల ఆశయాల సాధన దిశగా అడుగులు వేయాల్సిన ఉందని అన్నారు. ప్రజలకు కనీస మౌలిక అవసరాల కల్పన, సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం కృషి చేసేందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో మమేకమై ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో అనాదిగా ప్రజలు సిపిఐని ఆదరిస్తున్నారని, అనునిత్వం ప్రజల వెన్నంటి ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, సిపిఐ అందిస్తున్న సేవల ఫలితంగానే ప్రజలు ఆదరిస్తున్నారని, వారి నమ్మకానికి అనుగుణంగా ప్రజల్లో మరింత మమేకమవుతామని పునరుద్ఘాటించారు. 2014కు పూర్వం జరిగిన అభివృద్ధి మినహా నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, ప్రజలు కనీస మౌలిక వసతులకు నోచుకోని పరిస్థితులు ఉన్నాయన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ పేదవాడికి దక్కేలా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు చొరవ తీసుకోవాలని, ప్రజలను చైతన్యవంతం చేసి అవసరమైన పరిస్థితిలో అధికార యంత్రాంగం, ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఉద్యమబాట పట్టాలని పిలునునిచ్చారు. అనంతరం జాతిపతి మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ చిత్రపఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఐ మండల కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కె.తర్నకుమారి, ఎం. ధనలక్ష్మి, నాయకులు నూనావత్ గోవిందు, జర్పుల మురళి, నున్నా ధనుంజర్రావు, పోశం, సాధిక్, చలమల సత్యం, మహేష్, సైదులు, బైకాని కృష్ణ, బోళ్ళ లక్ష్మారెడ్డి, షాహిన్, శంకర్, ఐలయ్య, రజియా, లక్ష్మి, పడిగే ఎర్రయ్య, నాగేశ్వర్రావు, రమేష్, బోళ్ళ లక్ష్మారెడ్డి, బైకాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.