మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి12: అశ్వాపురం మండలంలో హాత్ సే హాత్ జోడోయాత్ర లో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఆదివారం మాదిగ జేఏసీ రాష్ట్ర కమిటీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా మాదిగ జాతి ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తున్నారని, వివిధ రాజకీయ పార్టీలు, యావత్తు సమాజం, మేధావులు అందరూ ఈ న్యాయమైన డిమాండ్ కు మద్దతు పలికినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. దీనిపై పార్లమెంట్ లో చట్టం చేసి రాష్ట్రాలకు ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్ లను విభజించే హక్కును కల్పించేలా చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రేవంత్ రెడ్డికి అందజేశారు.
