UPDATES  

 వదల మోడీ.. వదలా.. అసెంబ్లీలో అంతా కక్కేసిన కేసీఆర్

ఆయన మైకు పడితే పూనకాలే. ప్రత్యర్థుల పై విరుచుకుపడటమే. సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే. ప్రశ్నలతో కడిగిపారేస్తారు. అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేస్తారు. ఆయన వాగ్ధాటికి ప్రత్యర్థులు హడిలిపోతారు. కచ్చితమైన సమాచారంతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతారు. ఇంతకీ ఆయనెవరు ? ఆయన కథేంటి స్టోరీలో తెలుసుకోండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్.. నరేంద్ర మోదీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. 2014లో మోదీ, బీజేపీ గెలిచారు. కానీ భారత ప్రజలు ఓడిపోయారంటూ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని పాలకులకు అభివృధ్ధి పై చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రోజురోజుకీ పక్షపాత ధోరణి పెరుగుతోందని విమర్శించారు. 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వరా అన్ని ప్రశ్నించారు. తెలంగాణతో పాటు ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా .. అది అన్యాయమేనని అన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రూ. 495 కోట్లు రావాలని అన్నారు. విభజన సమయంలో ఏపీ ఖాతాలో వేశారు. ఇప్పుడు అడుగుతుంటే ఇవ్వరేం అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని, దేశ రాజధాని ఢిల్లీలో తాగడానికి నీళ్లు లేవని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో 20 లక్షల మంది పౌరసత్వం వదులుకున్నారని చెప్పారు. దేశంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ సింగ్.. మోదీ కంటే ఎక్కువ చేశారని అన్నారు. కానీ ఆయన మోదీలా డప్పు కొట్టుకోలేదని చెప్పారు. మోదీ డప్పు కొట్టుకుని గెలిచారని విమర్శించారు. ప్రతి రంగంలో దేశం దెబ్బతిందని, ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని ఆరోపించారు. దేశం దివాళా తీస్తున్నా.. తామే గొప్పవారంటూ జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహారం చూస్తుంటే.. దేశ పరిస్థితి అర్థం కావడంలేదని అన్నారు. అదానీ వ్యవహారం నుంచి దేశం ఎలా బయటపడుతుందని కాంగ్రెస్, భారాసా ప్రశ్నిస్తుంటే.. ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడటంలేదని అన్నారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ, పలు బ్యాంకులు పెట్టుబడులు పెట్టాయని, అప్పులు ఇచ్చాయని అన్నారు. ఇప్పుడు వాటి పరిస్థతి ఏంటో అర్థం కాలేదన్నారు. నోరెత్తితే నెహ్రూ, ఇందిరగాంధీ గురించి మాట్లాడుతారు. వారు చనిపోయి ఎంతో కాలమైంది. వాళ్లు ఏం చేశారో చెప్పడం ఇప్పుడు అవసరమా ? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీలో బీజేపీని కేసీఆర్ చెడుగుడు ఆడారని చెప్పారు. బీజేపీ వైఫల్యాల పై గుక్క తిప్పుకోకుండా ప్రసంగించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను కడిగిపారేశారని చెప్పవచ్చు. ఆసక్తికరంగా కేసీఆర్ కాంగ్రెస్ నాయకుల్ని స్మరించుకున్నారు. మన్మోహన్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉంటే దేశం పరిస్థితి ఇలా ఉండేది కాదంటూ బీజేపీకి చురకలంటించారు. నెహ్రూ, ఇందిర పై బీజేపీ నేతల విమర్శలను తప్పుబట్టారు. ఎప్పుడో చనిపోయిన వారిని పదేపదే విమర్శించడం ఏం సంప్రదాయమంటూ నిలదీశారు. కేసీఆర్ వైఖరి చూస్తేంటే.. కాంగ్రెస్ పట్ల సానుకూల వైఖరితో వెళ్లనున్నట్టు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా కేసీఆర్ కాంగ్రెస్ ను వెనకేసుకు రావడం కొత్త చర్చకు దారితీస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !