గుండెల్లో భయం… గుప్పిట్లో ప్రాణం…
– ట్రాక్టర్ డ్రైవర్ల పరిస్థితి దారుణం…
– ఓవర్ (లోడ్) చేస్తున్న కర్ర ట్రాక్టర్లు
– గాలిలో దీపంలా డ్రైవర్ ల ప్రాణాలు..
– రోడ్డున పడుతున్న కుటుంబాలు…
– తూతూ మంత్రంగా తనిఖీలు…
– తీరు మార్చుకోని గుత్తేదారులు…
మన్యం న్యూస్, భద్రాచలం / సారపాక , ఫిబ్రవరి 24
పొట్టకూటికోసం.. కుటుంబ పోషణ కోసం… జామాయిల్, సుబాబుల్ రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు అధిక లోడుతో అనుకున్న సమయానికి స్టాక్ పాయింట్ కు చేరాలని భయాన్ని గుండెల్లో పెట్టుకొని.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని నిత్యం మృత్యువుతో సావాసం చేస్తూ కుటుంబ పోషణ కోసం శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. బూర్గంపాడు మండల పరిధిలోని ఐటిసి పి.ఎస్.పి.డి కర్మగారానికి నిత్యం ట్రాక్టర్లు, లారీల ద్వారా జామాయిల్, సుబాబుల్ కర్రతోలకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఐటిసి పి.ఎస్.పి.డి కర్మాగారానికి సమీపంలో ఉన్న కర్ర యార్డ్ వద్ద జామాయిల్, సుబాబుల్ కర్రలను స్టాక్ పాయింట్ నీ ఏర్పాటు చేసి ఆ ప్రదేశంలో స్టోర్ చేస్తూ ఉంటారు. కర్రల స్టాక్ పాయింట్ కు స్థానిక మండలాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా తీసుకువస్తూనే ఉంటారు. అయితే కర్రలను స్టాక్ పాయింట్ కు తీసుకువచ్చే వాహనాలను నడపడం, అదుపు చేయడం అంత సులువైన విషయమైతే కానే కాదు. అనుభవజ్ఞులైన డ్రైవర్లు మాత్రమే వాహనంలో ఉన్న లోడును, వాహనాన్ని అదుపు చేసే విధంగా నడపగలరు. దాంతోపాటు అధిక మొత్తంలో కర్రను తీసుకువచ్చే వాహనాలకు సంబంధించిన అన్ని పేపర్లు, అనుమతులు ముందుగానే సంసిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తూ ఉన్నాయి. పరిమితికి మించిన లోడులతో నిత్యం రహదారులపై ఊగుతూ వెళ్తున్న ట్రాక్టర్లు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కర్రతోలకాలు నిర్వహించే ట్రాక్టర్ల రోడ్డు ప్రమాదాలు అత్యంత భయానకంగ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి.
– గాలిలో దీపంలా డ్రైవర్ ల ప్రాణాలు..
స్థానికంగా ఉన్న స్టాక్ పాయింట్లకు జామాయిల్, సుబాబుల్ కర్ర లోడులను తీసుకువచ్చే ట్రాక్టర్ డ్రైవర్ల ప్రాణాలు గాలిలో దీపాల కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కర్ర రవాణా చేసే ట్రాక్టర్ల పై అధిక లోడును చేస్తున్నారన్న సంగతి డ్రైవర్లకు తెలిసిన కాదనలేని పరిస్థితి వారిది. అధిక లోడుతో అనుకున్న సమయానికి స్టాక్ పాయింట్ కు చేరాలని భయాన్ని గుండెల్లో పెట్టుకొని.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని నిత్యం మృత్యువుతో సావాసం చేస్తూ కుటుంబ పోషణ కోసం శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. కర్రలోడును తీసుకువచ్చేందుకు డ్యూటీ కి వెళ్ళిన ట్రాక్టర్ డ్రైవర్ ఇంటికి వచ్చేంతవరకు వారి కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉండాల్సిన పరిస్థితులు కోకొల్లలుగా కళ్ళముందే కనిపిస్తూ ఒళ్ళు గగర్లు పొడిచేలా దర్శనమిస్తూ ఉన్నాయి. డ్యూటీ కి వెళ్లి ఇంటికి డబ్బులు తీసుకొని వస్తాడు అనుకుని ఎదురు చూస్తున్న భార్యాబిడ్డలకు తమ కుటుంబ సభ్యుడు కనీసం చూడలేని పరిస్థితిలో ఘోరాతి ఘోరమైన స్థితిలో విగత జీవిగా ఇంటికి తిరిగి వస్తున్న సంఘటనలు స్థానికులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ర ట్రాక్టర్ డ్రైవర్ల కుటుంబాలు తమ కుటుంబ పెద్దను కోల్పోయి, అనాధలుగా మారుతున్న సంఘటనలు ఎన్నెన్నో. ఇంత జరుగుతున్నప్పటికీ ట్రాక్టర్ ఓనర్లు గాని, గుత్తేదారులు గాని తమకు మిగులుతున్న డబ్బుకు ఇచ్చే విలువ ఓ మనిషి ప్రాణానికి ఇవ్వడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– తీరు మార్చుకొని గుత్తేదారులు…
మండల పరిధిలోని సారపాక గ్రామంలో ఉన్న కర్ర స్టాక్ పాయింట్ తో పాటు, ఇటీవల మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో సైతం మరో స్టాక్ పాయింట్ ను ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రాంతాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద మొత్తంలో ఈ రెండు స్టాక్ పాయింట్లకు కర్ర తోలకాలను జరుపుతూ ఉన్నారు. అయితే ఎక్కువ శాతంగా జామాయిల్, సుబాబుల్ సాగు చేసే రైతుల వద్ద నుండి కొందరు గుత్తేదారులు పూర్తి పంటను పొలం వద్దనే తక్కువ ధరకు కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన పంటను ట్రాక్టర్ల ద్వారా ఈ స్టాక్ పాయింట్లకు తరలిస్తూ ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లుగా తెలియ వస్తుంది. ఈ నేపథ్యంలో కొనుగోలు చేసిన కర్రను తక్కువ ట్రిప్పుల్లో యాడ్ వద్దకు చేర్చి రవాణా ఖర్చులు మిగిలించుకునేందుకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుభవం లేని డ్రైవర్లతో, కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని వ్యక్తులతో కర్రతోలకాలు సాగిస్తున్నారనే విమర్శల సైతం భారీగానే వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కర్రతోలకాల నిర్వహిస్తున్న ట్రాక్టర్లు రోడ్డు ప్రమాదాలకు గురై డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ గుత్తేదారుల తీరు మాత్రం మారడం లేదు. ట్రాక్టర్ల పై మోతాదుకు మించి ఎక్కువ మొత్తంలో కర్రను లోడ్ చేస్తూ డ్రైవర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– తూతూ మంత్రంగా తనిఖీలు…
భద్రాచలం, బూర్గంపాడు మండలంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటూ ఓవర్ లోడ్ తో వస్తున్న వాహనాలను ఆపి, తనిఖీ చేస్తూ అధిక లోడు వాహనాలకు చలనాలు విధిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. వాహన యజమానులకు, డ్రైవర్లకు మోతాదుకు మించిన లోడులతో రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పరిస్థితిలో చక్కబడుతున్నట్లుగా మాత్రం కనిపించడం లేదు. చలానాలతో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు లేవని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల భద్రాచలం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, బూర్గంపాడు ఎస్సై సంతోష్ కుమార్ తమ బృందాలతో పలు ప్రాంతాల్లో అధికలోడలతో వస్తున్న వాహనాలను తనిఖీలు చేసి చలనాలు విధిస్తూ చర్యలకు పూనుకున్నారు. అయినప్పటికీ అర్ధరాత్రి వేళల్లో అధిక లోడుతో ఉన్న వాహనాలు వెళుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ పాయింట్లను కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల ఉన్న చెక్ పోస్టులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, అధిక లోడుతో వచ్చే ట్రాక్టర్లను అనుమతించకపోతే ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు మేధావులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మితిమీరిన లోడలతో స్టాక్ పాయింట్లకు రవాణా చేస్తున్న ట్రాక్టర్ల ద్వారా ఆ ట్రాక్టర్ డ్రైవర్లతోపాటు రహదారుల పై ప్రయాణించే ప్రయాణికుల సైతం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొల్పుతున్నాయి. ఈ సమస్యపై అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్తూ ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.