మంచి మగాడిగా మార్చేస్తా ..
క్షుద్ర పూజలతో హిజ్రాని మళ్లీ మామూలు మనిషిని చేస్తా.. సంచలనం రేపిన సంఘటన
నారంవారిగూడెం గ్రామంలో తెరపైకి మూఢనమ్మకం
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 25.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందున్న, ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. హిజ్రాగా మారిని వ్యక్తిని తిరిగి పురుషుడుగా మారుస్తానంటు వ్యక్తి చెప్పిన మాటలను హిజ్రా కుటుంబ సభ్యులు నమ్మడమే ఇందుకు నిదర్శనం. ఈ ఘటన అశ్వారావుపేట మండలం, నారం వారిగూడెం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నారంవారిగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రెండున్నర సంవత్సరాల క్రితం హిజ్రాగా మారాడు. ఇతని తల్లి తన కొడుకుని తిరిగి బాగు చేయాలని ఉద్దేశంతో క్షుద్ర పూజలు చేసే కొందరు వ్యక్తులను సంప్రదించింది. ఈమె ఆమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న సదరు వ్యక్తులు నీ కొడుకుకి శంకిని దెయ్యం పట్టడం వలనే హిజ్రాగా మారాడని నమ్మించారు. దానికి విరుగుడుగా శుక్రవారం రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించి ఇంట్లో గొయ్యి తీసి శంకిని దెయ్యాన్ని అందులో పూడ్చి పెడతామని చెప్పారు. అనుకున్నట్టుగానే ఇంటి గదిలో గొయ్యి తవ్వడం ప్రారంభించిన తరవాత ఇక్కడ గుప్త నిధులు కూడా ఉన్నాయన్నారు. ఆ బంగారం మీకు కావాలంటే అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహించాలని అందుకు 150 గ్రాములు బంగారం ముందుగా వారికి ఇవ్వాలనే మాయమాటలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎస్సై రాజేష్ కుమార్, ఘటనా స్థలికి చేరుకొని క్షుద్ర పూజలకు ఆశ్రయించిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి జరగబోతున్న మోసం పట్ల అవగాహన కల్పించారు. క్షుద్ర పూజలు చేస్తామని నమ్మబలికే ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.