గుక్కెడు నీటి కోసం గూడెం ప్రజలు అగచాట్లు…
ప్రజా ప్రతినిధులు ఉత్తర కుమార ప్రగల్బాలు మాని చిత్తశుద్ధితో పని చేయాలి
కిన్నెరసాని జల దీక్ష నిరసన కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్..
మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25..
కొత్తగూడెం నియోజకవర్గం లో ప్రజలు గుక్కెడు నీటి కోసం అగచాట్లు పడుతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ మండిపడ్డారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పట్టణంలోని చిల్డర్న్స్ పార్క్ ఎదురుగా ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య పై కిన్నెరసాని జలదీక్ష పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని,స్థానిక ఎమ్మెల్యే కిన్నెరసాని నీటి సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి 130 కోట్ల రూపాయల నిధులు మంజూరు అవుతున్నాయని ప్రకటించారని గుర్తు చేశారు..నెలలు గడుస్తున్నా నేటికి రూపాయి కూడా మంజూరు కాలేదని,ఎమ్మెల్యే ఉత్తర కుమార ప్రగల్బాలు పలకడం మాని చిత్తశుద్ధితో పని చేయాలని హితవు పలికారు. వేసవి కాలం సమీపించిన గాని మరింత దుర్బర పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు..వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు..లేదంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని అవసరమైతే కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ గంధంమల్లికార్జునరావు,సాయి,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కోలా మల్లికా,కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,కేతిని కుమారి,మాలోత్ భానుమతి* తదితరులు పాల్గొన్నారు.ఈ దీక్షలకు టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాధం, ఏజెన్సీ పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లాల్ సింగ్ నాయక్,ఎల్ఎచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్,రమేష్ నాయక్,జనసేన రాష్ట్ర నాయకులు నౌతన్,బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురిమిళ్ల శంకర్,తెలంగాణ విభిన్న ప్రతిభ వంతుల సంఘం అధ్యక్షుడు సతీష్ గుండపునేని,తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు మూతి రామకృష్ణ తదితరులు మద్దతు తెలిపారు.దీక్షలను స్వేరోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకబత్తిని వీరయ్య నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.
