గ్రామాలలో మంచినీటి సమస్య రావద్దు
వచ్చేది ఎండాకాలం జాగ్రత్తలు అవసరం
సర్వసభ్య సమావేశంలో తెలియజేసిన ఎంపీపీ గుమ్మడి గాంధీ
మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 25
ఎండాకాలం సమీపిస్తున్నందున గ్రామాలలో నీటి సమస్య లేకుండా చూసుకోవాలని, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ముందస్తు చర్యలు తీసుకొని తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. శనివారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి దిశగా మండలం అడుగులు వేయాలంటే, ప్రతి ఒక్క అధికారి తమ విధిని కచ్చితంగా నిర్వహించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు వారి అభివృద్ధి నివేదికలను చదివి వినిపించారు. మిషన్ భగీరథ పనితీరు మెరుగుపడాలని పంచాయతీ సర్పంచులు తెలియజేశారు. ఇప్పటికే గ్రామాలలో నీటి సమస్య ఉందని పలుమార్లు తెలియజేసిన, పట్టించుకోవడంలేదని అన్నారు. పోట్లపల్లి పంచాయితీలో నిర్మించిన చెక్ డాం రెండు సంవత్సరాల కాలంలోనే శిధిలావస్థకు చేరి చుక్క నీరు కూడా ఆగడం లేదని, గత సంవత్సరము ఈ సమయంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతం నేడు ఎడారిగా మారిందని అన్నారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమే కారణమని సర్పంచ్ అన్నారు. కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండానే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తూ, ప్రోటో కాల్ కి భంగం కలిగిస్తున్నారని ఎంపీపీ తెలియజేశారు. ఈ పద్ధతిని మార్చుకోవాలని మరో మారు, ఇలా జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, తహాసిల్దార్ ప్రసాదరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.