అన్ ఫిట్ వెహికల్స్… ఆన్ రోడ్ సర్కస్… – అడిగితే అంతు చూస్తాం – ఇష్టారాజ్యంగా నడుస్తున్న కర్ర ట్రాక్టర్లు – చోద్యం చూస్తున్న అధికారులు మన్యం న్యూస్, భద్రాచలం / సారపాక , ఫిబ్రవరి 27 జామాయిల్, సుబాబుల్ కర్ర రవాణా చేస్తున్న ట్రాక్టర్లు రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబాలు వీధిని పడుతున్న సంఘటనలు పునరావృత్తం అవుతున్నప్పటికీ ట్రాక్టర్ యజమానులు, కాంట్రాక్టర్లు మాత్రం కేవలం రవాణా ఖర్చులు మిగిలించుకునేందుకు కక్కుర్తి పడి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పలు పత్రికల్లో అధిక లోడు తో వెళ్తున్న వాహనాలపై వరుస కథనాలు ప్రచురితమవుతున్నప్పటికీ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకుంటున్నారని విమర్శలు లేకపోలేదు. కర్రలోడుతో వచ్చే ట్రాక్టర్లను అనుభవజ్ఞులైన డ్రైవర్లు మాత్రమే ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో, రహదారులు బాగోలేని ప్రాంతాల్లో అదుపు చేయగలిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అనుభవం లేని డ్రైవర్లను, కొన్ని సందర్భాల్లో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్లను సైతం వాడుకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్నారు కొందరు ట్రాక్టర్ యజమానులు. తమ జేబులో నింపుకునేందుకు అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతూ వారిని బలి పశువులుగా చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా నడుస్తున్న కర్ర ట్రాక్టర్లు బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక, లక్ష్మీపురం ప్రాంతాలకు కర్రతోలకాలు నిర్వహించే కొందరు ట్రాక్టర్ యజమానులు మోతాదుకు మించి కర్రలను అడ్డగోలుగా లోడు చేస్తూ, ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లను నడిపిస్తున్న సందర్భాలు సారపాకలో కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. తక్కువ ట్రిప్పుల్లో ఎక్కువ లోడును తీసుకువెళ్లాలనే దురాశతో మోతాదుకు మించి లోడ్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు ప్రాణాలను కోల్పోయిన ట్రాక్టర్ డ్రైవర్ల కుటుంబాలు బ్రతికే ఆదివారం లేక కుటుంబ పోషణ కోసం అల్లల్లాడుతుంటే… మరోవైపు ట్రాక్టర్ యజమానులు పోయింది మా ప్రాణం కాదు కదా అన్నట్లుగా మరో డ్రైవర్ ని నియమించుకొని అదే పాత పద్ధతిలో అంతే అధిక లోడులతో తమ వ్యాపారాన్ని సాగిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతున్నారు. కొన్ని సందర్భాల్లో కర్రలోడును తీసుకువెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పటికీ వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ఇన్సూరెన్స్ లేని, అన్ ఫిట్ గా ఉన్న వెహికల్లను, అనుభవం లేని డ్రైవర్లను, మద్యం సేవించి వాహనం నడిపే డ్రైవర్లను వాడుకుంటూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు కొందరు కర్ర ట్రాక్టర్ల యజమానులు. చోద్యం చూస్తున్న అధికారులు మోతాదుకు మించి అధిక లోడుతో కర్ర ట్రాక్టర్లు రోడ్లపై ఊగుతూ.. జోగుతూ.. వెళ్తున్నప్పటికీ అధికారులు వాటిని నిలువరించలేకపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, బూర్గం పహాడ్ ఎస్సై పి.సంతోష్ కుమార్ లు తమ సిబ్బందితో పలుచోట్ల అధిక లోడులతో వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేసి చలనాలు విధిస్తున్నప్పటికీ ట్రాక్టర్ యజమానులలో ఎటువంటి మార్పు రాకుండా… అదే పాత పోకడను అవలంబించడం పలు అనుమానాలకు తావు తీస్తుంది. పగలు, రాత్రి తేడా లేకుండా అధిక లోడ్ లతో ట్రాక్టర్లు పలు ప్రాంతాల నుండి సారపాక, లక్ష్మీపురం ప్రాంతాలకు దర్జాగా చేరుకుంటున్నప్పటికీ వారిపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం ఎంతవరకు సమంజసం అని స్థానికులు, పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – అడిగితే అంతు చూస్తాం అధికలోడుతో వెళ్తున్న కర్ర ట్రాక్టర్లు రోడ్లపై చేస్తున్న విన్యాసాలకు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ నిమిషంలో ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అని రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను ఎవరైనా ఎందుకు ఇంత లోడుతో వెళ్తున్నారని ప్రశ్నిస్తే.. వారిపై దురుసుగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మేము లోకల్ మా జోలికి వస్తే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అధికారులే మమ్మల్ని చూసి ఉన్నట్లు వదిలేస్తున్నారు. అలాంటప్పుడు మీకెందుకని ప్రశ్నించిన వారిపై తిరగబడుతున్న సందర్భాలు సారపాకలో నెలకొంటున్నాను. ఓవైపు పత్రికల్లో వార్తలు ప్రచురితమవుతున్నప్పటికీ అధికారుల్లోనే చలనం లేదు మీకెందుకంటూ స్థానికులను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలియ వస్తుంది. వార్తలు ఫోటోలు తీసుకుంటున్న విలేకరులపై దురుసుగా ప్రవర్తిస్తూ మా ఫోటోలు తీస్తే అంతు చూస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. మా వెనక రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారుల సైతం మేము చెప్పినట్టు వింటారు అని ఈ కేటుగాళ్లు మేకపోతు గాంబిర్యాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అధికారులు చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్నట్లుగా వ్యవహరిస్తారా..? లేక చూసి చూడనట్లు వ్యవహరిస్తారో వేచి చూడాలి
