UPDATES  

 పెద్ద సార్ చొరవ.. మన్యం బిడ్డ తెగువ

పెద్ద సార్ చొరవ.. మన్యం బిడ్డ తెగువ
ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధులతో రహదారులు
ఫలించిన ఎమ్మెల్యే రేగా కృషి
పినపాక మండలంలోని మారుమూల గ్రామాలకు మహర్దశ
పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన మండల అధ్యక్షుడు పగడాల

మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 28.. తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన బిడ్డల కోసం అత్యంత చొరవ తీసుకుంటాడని సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించి సాధ్యమైనంత వరకు నిధులను మంజూరు చేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని… అదే తరహాలో పెద్ద సారు చొరవతో తో మన్యంబిడ్డ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెగువతో మారుమూల గిరిజన గ్రామాలన్నీ సస్యశ్యామలంగా తులతూగుతున్నాయని పినపాక బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మారుమూల గ్రామాలకు సైతం రహదారులు ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి, పినపాక మండలానికి రహదారుల అభివృద్ధి నిమిత్తం రూ.8 కోట్ల 12 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేయించారని తెలియజేశారు. ఆ నిధులతో మండలంలోని బీటీ రహదారుల వివరాలు ఇలా ఉన్నాయి.
పాండురంగాపురం- సింగిరెడ్డిపల్లి రహదారికి రెండు కోట్ల 20 లక్షలు, ఐలాపురం- చిర్రమల్ల రహదారికి రూ.1. 42 కోట్లు, అడవిరామారం- కిష్టాపురం రహదారికి రూ.1.06కోట్లు నారాయణపురం- మడతన కుంట రహదారికి రూ.66 లక్షలు, పినపాక- మారేడుగూడెం సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.53 లక్షలు, అంతేగాక పినపాక మండలంలోని గ్రామాల్లో గల అంతర్గత వీధులకు శాశ్వత పరిష్కారం కల్పిస్తూ 45 సీసీ రోడ్డు నిర్మాణాలు మంజూరయ్యాయని తెలియజేశారు. ఏడూళ్ల బయ్యారం 10, తోగ్గూడెం 6, పాతరెడ్డిపాలెం 3, పోట్లపల్లి 2, మల్లారం 4, జగ్గారం 2, జానంపేట 4, చేగర్శల 2, దుగినేపల్లి 3, టీ కొత్తగూడెం 4, అమరారం 1, సింగిరెడ్డిపల్లి 4 సి సి రోడ్డు నిర్మాణాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. పినపాక మండలం అభివృద్ధి కోసం తనదైన శైలిలో సహాయాన్ని అందిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఈ నిధులను మంజూరు చేయించడంలో ముఖ్య పాత్ర పోషించిన మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత, సీఎం కేసీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !