మన్యం న్యూస్, మణుగూరు, మార్చి 1: రాష్ట్రంలో ఉన్నత చదువులు చదువుతున్నటువంటి మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రీతి, ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత సీనియర్ వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి హరీష్ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న డాక్టర్ ప్రీతి కాలేజీలో సీనియర్ విద్యార్థి మహమ్మద్ సైఫ్ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకొని మృతి చెందిందన్నారు. ప్రీతి కుటుంబానికి తగు న్యాయం చేయాలని, వారి కుటుంబానికి 50 లక్షలు ఎక్సిగేషన్ ఇవ్వాలని కోరారు. డాక్టర్ ప్రీతి మరణం మరవకముందే వరంగల్ జిల్లాకు చెందిన జమున కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి రక్షిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హమన్నారు. కొట్లాడి సాధించుకున్న బంగారు తెలంగాణలో భావితరాలను బలి చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. అనేక మంది విద్యార్థులు ర్యాగింగ్ కు బలవుతున్నారని, తక్షణమే ర్యాగింగ్ చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిని శిక్షించాలన్నారు. ర్యాగింగ్ రాష్ట్రంలో పునరావృతం కాకుండా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్మించాలన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు అఖిల్ తేజ, పట్టణ నాయకులు శ్రావణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
