మన్యం న్యూస్, భద్రాచలం , మార్చి 02.. భద్రాచలం నియోజకవర్గంలో గిరిజనులకు వేసవి ఉపాధి పంట అయినటువంటి తునికాకు సేకరణ ప్రూనింగ్ పనులను వెంటనే చేపట్టాలని, తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ సమావేశం ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భద్రాచలం నియోజకవర్గం లో గిరిజన గిరిజన పేదలుకు వేసవిపంటగా ఆర్థికంగా ఉపయోగపడుతున్న తునికాకు సేకరణకు సంబంధించిన మండకొట్టుడు ప్రూనింగ్ పనులను వెంటనే చేపట్టాలని డాక్టర్ మీడియం బాబురావు కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను ఎండకడుతూ కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీపట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగా, వై.వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు ఎన్.నాగరాజు, డి.సీతాలక్ష్మి, బి.కుసుమ, యు.జ్యోతి, జీవనజ్యోతి, సిహెచ్.మాధవరావు, ఎస్.డి.ఫిరోజ్ ఖాన్, కోరాడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.





