UPDATES  

 చిరునామాగా అశ్వారావుపేట నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం  రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

మన్యం న్యూస్.అశ్వారావుపేట. మార్చి 14.

మండలకేంద్రంలో రవాణాశాఖ ఉప కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడా అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న, డ్రైవింగ్ లైసెన్సు పొందాలన్న దాదాపు 100 కిమీ దూరంలో ఉన్న కొత్తగూడెం కార్యాలయానికి వెళ్లాల్సి వస్తున్నదని, ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రంలో రవాణా కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి మంగళ, శుక్రవారం రెండు రోజులు ఈ కార్యాలయంలో సేవలు అందుబాటులో ఉంటాయని విడతలు వారిగా పూర్తిస్థాయిలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యాలయం ఏర్పాటు వల్ల ప్రజలు సుదూర ప్రాంతం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని,అశ్వారావుపేట నియోజకవర్గాన్ని,పట్టణాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తయారు చేస్తామని,అశ్వారావుపేటను మున్సిపాల్టీగా ప్రకటించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లామని త్వరలో మున్సిపాల్టీగా రూపాంతరం చెందనున్నట్లుతెలిపారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు అశ్వారావుపేటకు సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసి ఆర్ దృష్టికి తేగానే గంటలో జిఓ విడుదల చేయడంతో పాటు 23 కోట్ల 50 లక్షలు నిధులను సైతం మంజూరు చేశారని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని గిరిజన ప్రాంత విద్యార్థులు డిగ్రీ విద్యను అభ్యసించేందుకు సుదూర ప్రాంతం వెళ్లాల్సి వస్తున్నదని, త్వరలో అశ్వారావుపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని సియం దృష్టికి తీసుకెళ్లారని, విచారణ ప్రక్రియ జరుగుతున్నదని త్వరలోనే డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని తెలియజేసారు.నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాలను అభివృద్ధిలో అద్భుతంగా తయారు చేస్తామని త్రాగునీటి సమస్యను తీర్చేందుకు మిషన్ బగీరథ చేపట్టామని,విద్యుత్ సమస్యను సైతం అధిగమించామని,రైతుబంధు ద్వారా రైతులకు సేద్యానికి నిధులు మంజూరు చేస్తున్నామని,వృధాగా పోతున్న గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుని మన జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబాబాద్ కు సమృద్ధిగా సాగునీరందించేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభోత్సవం నిర్వహిస్తామని,సీతమ్మ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని,పామాయిల్ దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నదని చెప్పారు.రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఆయిల్పమ్ చేయాలని లక్ష్యంగా కాగా, అశ్వారావుపేట నియోజకవర్గం ఉద్యాన పంటలకు హబ్ గా మారినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో జీడిమామిడి, కొబ్బరితో పాటు పెద్ద ఎత్తున ఆయిల్ష్పామ్ పంటలను సాగు చేస్తూ వ్యవసాయానికి చిరునామాగా మారిందని,గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతి పంచాయతీకి 10 లక్షలు ఎస్ ఎఫ్ నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు.అనంతరం అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు ఆర్టీఓ కార్యాలయం సత్తుపల్లిలో ఉండేదని, నూతన జిల్లాలు ఏర్పాటుతో అశ్వారావుపేట నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు రవాణా కార్యాలయం దూరమైనట్లు చెప్పారు. అశ్వారావుపేట నుండి కొత్తగూడెం వెళ్లడానికి ప్రజలు ఎంతో వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని, దూరం కావడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తేగానే వెంటనే అశ్వారావుపేట మండల కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 30 కోట్లతో సిసి రోడ్లు నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు.జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు నేటి నుండి రవాణా సేవలు అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 100 కిమీ దూరంలో ఉన్న కొత్తగూడెంనకు రావడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారని నేటితో ఆ సమస్య పరిష్కారమయినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో డిసియంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, రైతుబంధు జిల్లా కో ఆర్డినేటర్ జోగేశ్వరావు, జిల్లా రవాణా అధికారి వేణు, యంపిపి, జడ్పిటిసిలు, మండల నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !