మన్యం న్యూస్ మణుగూరు టౌన్, మార్చి 15
గోదావరి వరద బాధితులు, ఇండ్లులేని నిరుపేదలైన ఆదివాసి,దళిత ఇతర మహిళలకు గృహ వసతి కల్పించడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మార్చి 16న మణుగూరులో ప్రదర్శన, ఎమ్మెల్యే రేగా కాంతారావు క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెదగొని ఆదిలక్ష్మి, అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షులు భానోత్ ఊక్ల, పోరాట కమిటీ నాయకులు చిడెం ప్రశాంత్,సున్నం భూలక్ష్మి తెలియజేశారు.పినపాక,భద్రాచలం నియోజక వర్గాల్లో ఆదివాసిలకు హక్కుగా ఉన్న భూమి,ఖనిజాలపై వారికి ఎలాంటి ఆదాయం లేకుండా చేస్తున్నారు అని వారు అన్నారు.చట్టపరంగా వారికి ఇవ్వాల్సిన ఇంటి స్థలాలు కాని,పోడు సాగు భూమికి పట్టాలు గాని ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతుంది అన్నారు. దళితులకు కూడా ఎలాంటి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లేదు అని, ప్రభుత్వం దళిత బంధు కొందరికి ఇస్తూ,చేతులు దులుపుకుంటుంది అన్నారు. ఐదవ షెడ్యూల్ ఏరియాలో ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి అని,ఈ ప్రాంతంలోని బొగ్గు,ఇసుక,జామాయిల్ తోటలు,క్వారీలు,ధర్మల్ పవర్, పేపర్ మిల్లు,తునికాకు తో పాటు ఇతర పరిశ్రమల నుండి వస్తున్న ఆదాయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.వీటి నుండి వచ్చే లాభాలను స్థానిక ఆదివాసి,దళితుల మౌలిక వసతులపై,ఉపాధి పై ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేశారు.2022 జూలై 17న భద్రాచలంలో ముంపు బాధితులకు సురక్షిత ప్రాంతంలో శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీని వెంటనే నెరవేర్చలని వారిని కోరారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ మారుతా అని చెప్పిన రేగా కాంతారావు పార్టీ మారి,అభివృద్ధిని విస్మరించారు అన్నారు.తన అభివృద్ధే ఆదివాసీల అభివృద్ధిగా తాను భావిస్తున్నారు అని,అధికారం శాశ్వతం కాదనీ, సంపాదించినదంతా వెంట రాదని కాంతారావు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది అన్నారు. ఆదివాసి బిడ్డగా ఆదివాసి, దళితుల సమస్యలను పరిష్కరిస్తే నాలుగు కాలాల పాటు ప్రజలు గుర్తుంచుకుంటారు.ఈ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ భూములపై బహిరంగ ప్రకటన చేయాలని వారు కోరారు.1/70 లాంటి చట్టాలను అతిక్రమించి భూఆక్రమణలు జరుగుతున్నా ఎమ్మెల్యే రేగా కాంతారావు పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. ఆదివాసి,దళితుల యెడల తన నిర్లక్ష్య ధోరణి నిరసిస్తూ, మార్చి 16న క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని ప్రగతిశీల మహిళా. సంఘం, గోదావరి ముంపు బాధితులు, నిరుపేద గృహకల్ప పోరాడ కమిటీ నిర్ణయించింది అన్నారు. పినపాక,భద్రాచలం నియోజకవర్గాల పరిధిలోని ఆదివాసి దళితులు ఇతర పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొని డబల్ బెడ్ రూమ్ లు కట్టించాలని డిమాండ్ చేయాలనీ అన్నారు.





