మన్యం న్యూస్, ఇల్లందు పట్టణం మార్చి 15: ఇల్లందు మున్సిపాలిటీని అభివృద్ధిపథంలో మరింత ముందుకు తీసుకువెళ్లే వ్యూహంలో భాగంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో పురపాలక సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ఇల్లందు మోడల్ మార్కెట్, లేక్ పార్క్, డంపింగ్ యార్డ్ ఎఫ్ఎస్టీపీ బిల్డింగ్ నిర్మాణ పనులను బుధవారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ అంకుష్ షావలి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్మాణ పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి నాణ్యతతో,కచ్చితమైన ప్రమాణాలతో నిర్మాణాలను నిర్దిష్టమైన సమయంలో పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ డిఈ రచ్చ రామకృష్ణ, ఏఈ శంకర్, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.





