మన్యం న్యూస్, మణుగూరు, మార్చి16: మణుగూరు నుండి బీటీపీఎస్ వరకు ప్రధాన రహదారి మరమ్మత్తులు వెంటనే చేయించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపందా మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్ మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మణుగూరు నుండి బీటీపీఎస్ వరకు ప్రధాన రహదారి గుంతల మయంగా మారి వివిధ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ఈ రహదారిపై నిత్యం బొగ్గు లారీలు, ఇసుక లారీలు, బస్సులు, కార్లు, మోటార్ సైకిళ్ళు లాంటి వందలాది వాహనాలు తిరుగుతుంటాన్నారు. రాత్రి సమయాలలో గుంతలను గమనించక అనేక మంది మోటార్ సైకిళ్ళు ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. దీనికి తోడు కొంతమంది బొగ్గు టిప్పర్ల డ్రైవర్లు అధిక స్పీడుతో వెళ్లడం వల్ల కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మణుగూరు నుండి బీటీపీఎస్ వరకు ప్రధాన రహదారి మరమ్మత్తులు వెంటనే చేపట్టి, అదేవిధంగా బొగ్గు టిప్పర్ ల అధిక వేగాన్ని నియంత్రించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోకపోతే, మా పార్టీ ఆధ్వర్యంలో కలిసి వచ్చే పార్టీలను సంఘాలను కలుపుకొని ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా మణుగూరు అశ్వాపురం, మండలాల నాయకులు ఎండి గౌస్, జీవన్ తదితరులు పాల్గొన్నారు
