మన్యం న్యూస్, మంగపేట, మార్చి 17..
ప్రపంచ విపణి లో భారత సుగంధ ద్రవ్యాలకి బంగారు భవిష్యత్తు ఉందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ స్పైసెస్ బోర్డు సహాయ సంచాలకురాలు శ్రీమతి విజ్జిస్ట్న అధ్యక్షతన జరిగిన సుగంధ ద్రవ్యాల నాణ్యత మెరుగుదలపై రైతు ఉత్పత్తిదారుల మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో ప్రత్యేక ఆహ్వానితులుగా సాంబశివరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ విపణిలో సుగంధ ద్రవ్యాల ఎగుమతిలో భారత్ అందె వేసిన చేయి అన్నారు రైతులు రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే రాయితీలను వినియోగించుకొని ఆర్థిక సాధికారిత సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా అనేక వ్యవసాయ మరియు అనుబంధ రంగాల పథకాలు అమలు కానున్నట్లు తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు చేసి ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలన్నారు జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ నుండి పసుపు మరియు మిర్చి రైతుల కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం కావాల్సిన పథకాలపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నందున ఎఫ్ పి ఓ లు తమ దరఖాస్తులను అందజేయాలని కోరారు గడచిన మూడు సంవత్సరాలుగా మిర్చి పంటకు మార్కెట్లో మంచి ధర ఉండటం సంతోషదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు వరంగల్ రీజనల్ ఆఫీస్ ఏడి శ్రీమతి విద్యుస్ట్న వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బి రవీందర్ రెడ్డి స్పైసెస్ బోర్డు అధికారులు శరణప్ప శ్రీనివాస్ సిటిఎఫ్సి మెంబర్ అంజిరెడ్డి రామప్ప ఎఫ్ఈఓ ప్రతినిధి నరెడ్ల వేణు సుమారు యాభై మంది రైతు ఉత్పత్తి దారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.