మన్యం న్యూస్, మణుగూరు, మార్చి18 : మండలంలోని వెన్నెల జలపాతానికి కొత్త రూపం తీసుకువస్తానని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన శనివారం మండలంలోని వెన్నెల జలపాత ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్నెల జలపాతం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వెన్నెల జలపాతం పర్యాటక రంగంగా మారిన తర్వాత ప్రజలు ఆహ్లాదం కోసం కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా గడపవచ్చన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆనందంగా ఉండాలనే జలపాతాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు సాయి, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జ్ యాంపాటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
