- గర్జిస్తున్న గ్రామ సింహం
- కుక్కల బెడద తగ్గేదెలా.?
- వందల సంఖ్యలో వీధి కుక్కలు-భయపడుతున్న ప్రజానీకం.
మన్యం న్యూస్, పినపాక:. మార్చి 19
మండల పరిధిలోని పినపాక గ్రామంలో ఆదివారం వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. పినపాక గ్రామానికి చెందిన అశ్వక్, సాయి పవన్ అనే కు?ర్రాళ్లపై వెంటాడి మరి తీవ్రంగా కరవడం జరిగింది. గాయాల పాలైన వీరిద్దరిని పినపాక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. గతంలో కూడా వీధి కుక్కలు స్వైర విహారం చేసి పలువురిని బాధించాయి. సరదా కోసం చిన్న కుక్క పిల్లలను పెంచుకోవడానికి ఎక్కడ నుంచో తీసుకురావడం, వాటిపై సరదా తీరిపోయాక వీధులలో వదిలేయడం వలన, ఆకలి కోసం అలమటించి పాదసారులను, ద్విచక్ర వాహనదారులను సైతం విచ్చలవిడిగా కరుస్తున్నాయి. మండల వ్యాప్తంగా కుక్కలు వందల సంఖ్యలో వీధుల్లో తిరుగుతున్నాయంటే, యజమానుల నిర్లక్ష్యం కారణంగానే. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి కుక్కల బెడద లేకుండా చేయాలని, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే భయపడుతున్నారని, వీధి కుక్కలు దారి వెంట కాపలాదారుల్లాగా ఉంటున్నాయని, ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి, శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజానీకం కోరుతున్నారు.