మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మార్చి 20…
బొగ్గు ఉత్పత్తిలో పీకేఓసి-2 సరికొత్త రికార్డు సృష్టించడం ఎంతో అభినందనీయం అని మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ అన్నారు.బొగ్గు ఉత్పత్తి,ఉత్పాదకత రవాణాలో యావత్ సింగరేణిలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న మణుగూరు ఏరియా చరిత్రలో ఓసి-2 సెక్షన్ 2022-23 వార్షిక నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని 12 రోజులు ముందుగానే 19.03.2023 నాటికే సాధించి మరో కొత్త రికార్డు సృష్టించడం జరిగిందన్నారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,2022-23లో ఓసి-2 నిర్దేశిత వార్షిక లక్ష్యం 96 లక్షల టన్నులకు గాను,96 లక్షల 07 వేల టన్నులు ఉత్పతి చేసి రికార్డు సృష్టించడం జరిగింది అన్నారు.అలాగే 100.85 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి పికేఓసి-2 మరో కొత్త రికార్డు సృష్టించడం ఎంతో అభినందనీయం అన్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి సాధించాలంటే భారీ యంత్రాలను పూర్తి స్థాయిలో, వినియోగించుకోవడం వల్ల లక్ష్యం సాధ్యమవుతుంది అన్నారు.మణుగూరు ఏరియా సామర్ధ్యం పై నమ్మకంతో, యాజమాన్యం ఏరియా అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరిపడా భారీ యంత్రాలను కోట్లాది రూపాయిలు వెచ్చించి, కొనుగోలు చెయ్యడం జరుగుతుంది అని తెలిపారు. అలాంటి విలువైన యంత్రాలను బ్రేక్ డౌన్ కు ఆస్కారం లేకుండా నిబంధనల ప్రకారం సక్రమంగా నడుపుకోవడం,సకాలంలో మెంటెనెన్స్ చెయ్యడం ద్వారా పూర్తి పని గంటలు వినియోగించుకుంటు అద్భుత ఫలితాలను సాధించవచ్చు అని తెలిపారు.ఈవాస్తవాన్ని గ్రహించి,రానున్న రోజుల్లో మణుగూరు ఏరియా ఉపరితల గనుల నుండి గత రికార్డ్లను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించేలా బొగ్గు అధికోత్పత్తికి కృషి చేయాలి అన్నారు.సమిష్టి కృషితో ఈ ఘనతకు కారకులైన పికేఓసి-2 ఉద్యోగులకు,సూపర్ వైజర్లకు, అధికారులకు,యూనియన్ల ప్రతినిధులకు జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ అభినంధనలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, రానున్న రోజులలో మరిన్ని రికార్డులను అధిగమించి నిర్దేశించిన ఉత్పత్తి,ఉత్పాదక లక్ష్యాలను నాణ్యతా ప్రమాణాలతో,రక్షణతో సాధించాలని సూచించారు.
టిబిజికేఎస్ బ్రాంచ్ ఉపాధ్యాక్షులు వి ప్రభాకర్ రావు మాట్లాడుతూ,ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ దిశ నిర్దేశంతో మణుగూరు ఏరియాలోని ఉద్యోగులు సమిష్టి కృషితో, ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ఉత్పత్తి, ఉత్పాదకతలో రికార్డ్ లు సృష్టించడం ఆనవాయితీగా జరుగుతుంది అన్నారు. పికేఓసి-2 ఉపరితల గని 2022-23 సంవత్సర బొగ్గు ఉత్పత్తిలో,బొగ్గు రవాణా లో లక్ష్యాన్ని ముందుగానే పూర్తి చేసి మరో కొత్త రికార్డు సృష్టించినందుకు గాను ఉద్యోగులకు,సూపర్ వైజర్లకు, ఇతర కార్మిక సంఘాల నాయకులకు,అధికారులకు, టిబిజికెఎస్ కార్మిక సంఘం తరపున హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
పికేఓసి ప్రాజెక్ట్ అధికారి టి లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ, అంకిత భావంతో పని చేస్తే అసాధ్యాన్ని,సుసాధ్యం చేసి అద్భుత ఫలితాలు రాబట్టుకోవచ్చు అన్నారు. 2022-23 సంవత్సరాల లక్ష్యాన్ని ముందుగానే పూర్తి చేసి,మరో కొత్త రికార్డు సృష్టించడం మనందరికీ ఎంతో గర్వకారణం అన్నారు.ఏరియా జీఎం దుర్గం రామచందర్ మార్గదర్శకంలో మణుగూరు ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకతలో చరిత్ర సృష్టిస్తుంది అన్నారు.ఇందుకు కృషి చేసిన పీకేఓసి -2 ఉద్యోగులకు,సూపర్ వైజర్లకు, కార్మిక సంఘాల నాయకులకు మరియు అధికారులకు వారు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.మన ఏరియా నుండి బొగ్గు డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని మున్ముందు కూడా బొగ్గు ఉత్పత్తి,రవాణాలో పికేఓసి-2 మరెన్నో రికార్డులు సృష్టించేందుకు సమిష్టి కృషితో సాధిస్తాము అని తెలిపారు.