- అన్నదాతలు అధైర్య పడొద్దు
- పంట నష్టంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
- ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్
- దెబ్బతిన్న పంటలను తహసిల్దార్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే
మన్యం న్యూస్,ఇల్లందు రూరల్, మార్చి 20 ఇల్లందు మండల పరిధిలోని మసివాగు, మాణిక్యారంలోని పలు గ్రామాలలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను సోమవారం ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇల్లందు మండలంలో పన్నెండు వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటలు సాగు చేశారని మరో పది రోజుల్లో పంట చేతికి వస్తుందనగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వర్షానికి మండలంలో సుమారు పన్నెండు వందల ఎకరాల మొక్కజొన్న పంటలు దెబ్బతిని అన్నదాతలకు అపారనష్టాన్ని మిగిల్చిందన్నారు. అలాగే మామిడి తోటలకు కూడా నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అధైర్యానికి లోను కావద్దని తానున్నానంటు భరోసానిచ్చారు. తాసిల్దార్, వ్యవసాయశాఖ అధికారులు జరిగిన పంట నష్టంపై నివేదికను రూపొందించారన్నారు. పంట నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం మాణిక్యరం గ్రామపంచాయతీలో వర్షాల కారణంగా ఈసం సుభాష్ ఇల్లు కూలిపోయిన విషయం తెలుసుకొని వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు తహసిల్దార్ కృష్ణవేణి, ఏడిఏ వాసవిరాణి, ఏవో సతీష్, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, డిసిసిబి డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు,మండల సొసైటీ డైరెక్టర్ భాస్కర్,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం రమేష్, జనరల్ సెక్రెటరీ ఖమ్మంపాటి రేణుక,మండల కో ఆప్షన్ సభ్యులు ఘాజీ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిన్నారపు రాజేష్, ఇంద్రనగర్ వార్డు సభ్యులు నీలం రాజశేఖర్, బోడ రమేష్, కే. మహేష్, ఎన్. యాకయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ,గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.