మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మార్చి 21
మణుగూరు సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పొరుగు సేవల వార్డు బాయ్ లను కొనసాగించాలని కోరుతూ ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఏరియా ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ డి.నాసర్ పాషా మాట్లాడుతూ,సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ప్రాంతీయ వైద్యశాలలో గత కొన్ని సంవత్సరాలుగా పొరుగు సేవల వార్డు బాయ్స్ 9 మంది పనిచేస్తున్నారనీ,ఇందులో 5 మంది సింగరేణి భూ నిర్వాసిత మల్లేపల్లి గ్రామానికి చెందిన వారు అన్నారు.మిగిలిన వారు స్థానికులు అని,ఈ పనినే ఉపాధిగా నమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారనీ అన్నారు.అంతేకాకుండా కరోనా సమయంలో కూడా వెనుకంజ వేయకుండా క్వారంటైన్ సెంటర్లో వార్డ్ బాయ్ లుగా సేవలు అందించారనీ,అలాగే సాధారణ వైద్య సేవలలో, అంబులెన్స్ లో వార్డు బాయ్ సేవలలో,సమీప గ్రామాలలో సింగరేణి ఉచిత వైద్య శిబిరాలలో వారు సేవలు అందించారని తెలిపారు.వీరిని త్వరలో,తొలగించబోతున్నారనే వార్త నేపథ్యంలో వీరి సేవలకు గుర్తింపుగా కానీ, సింగరేణి సామాజిక సేవలో భాగంగా కానీ,వీరిని ఇక్కడే కొనసాగించేలా తిరిగి టెండర్ వచ్చేలా కృషి చేయాలని వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్, వార్డ్ బాయ్ ల,విద్యాసాగర్, ఏ. శంకర్,జే.వేణు,జీ.సురేందర్,కే. నర్సింహారావు,కే.రాము,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.