- నాడు భగత్ సింగుకు..నేడు ప్రజాస్వామ్యానికి ఉరితాడు
- దేశ రక్షణకోసం వామపక్ష, ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఏకంకావాలి
- సిపిఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా భగత్సింగ్ 92వ వర్ధంతి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
దేశ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి స్వాతంత్రోద్యమంవైపు నడిపించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ మెడకు ఉరితాళ్ళు భిగించి హతమార్చితే.. మతోన్మాద ముసుగులో స్వదేశ పాలకులు నేడు ప్రజాస్వామ్యానికి ఉరితాళ్ళు బిగించి హత్య చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నర్సయ్య అన్నారు. సర్దార్ భగత్సౌంగ్, రాజగురు, సుఖదేవ్ 92వ వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో అమరవీరుల చిత్రపఠాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిదంగా పట్టణ పరిధిలోని రామవరం, 2 ఇంక్లైన్, బాబూక్యాంపు ఏరియాల్లోని భగత్ సింగ్ విగ్రహాలకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ పాలన నాటి బ్రిటీష్ తెల్లదొరల, రజాకార్ల పాలనను తలపిస్తోందని, చట్టసభల్లో ఉన్న మందబలంతో రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువస్తూ నిరంకుషపాలనను కొనసాగిస్తున్నారని, మరోవైపు ప్రజలు నిర్మించుకున్న 400కు పైగా ప్రభుత్వ సంస్థలను ఆదానీ, అంబానీలాంటి కుభేరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం వేగంగా అడుగులు వేస్తూ ఉద్యోగులను, కార్మికులకు రోడ్డుపాలే చేసే చర్యలకు పూనుకుంటోందని అన్నారు. రాష్ట్రాల విభజన చట్టంలో హామీ మేరకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోమని కేంద్రం తేల్చిచెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. మోడీ తీరుతో దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం ఏర్పడిందని, ప్రమాదకర పాసిస్టు నిరంకుశ, హిట్లర్ తరహా పాలనను కొనసాగిస్తున్న పరిస్థితిలో నాటి అమరవీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ను ఆదర్శంగా తీసుకొని దేశ ప్రజలు స్వదేశీ పాలకులపై తిరిగబడాలని, అదే వారికి మనం ఇచ్చే నిజమైన, ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, కందుల భాస్కర్, కె.రత్నకుమారి, నాయకులు తుమ్మ నర్సయ్య, బోయిన విజయ్ కుమార్, గుత్తుల శ్రీనివాస్, రవికిరణ్, రూపేష్, విజయలక్ష్మి, సోమయ్య, జోసఫ్, రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.