మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 24, పవిత్ర రంజాన్ మాసపు నెలవంక గురువారం సాయంత్రం కనిపించడంతో మండల పరిధిలోని జూలూరుపాడు, పాపకొల్లు, నర్సాపురం మసీదులలో ప్రత్యేక తరావి సున్నత్ నమాజ్ లు ప్రారంభించారు. మసీదులలోని మౌల్విసాహెబ్, ఆఫీజ్, అలీమ్ ల ఆధ్వర్యంలో పవిత్ర ఖురాన్ పఠణం చేస్తూ, ప్రత్యేక నమాజును చేశారు. రంజాన్ మాసపు 30 రోజుల వరకు తరావి నమాజులు జరుపుతారు. ఈ సంవత్సరం ముస్లింలకు అత్యంత ప్రీతికరమైన శుక్రవారం తెల్లవారుజాము నుంచి (రోజా) ఉపవాసము (సహిరి ) దీక్షలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి, సాయంత్రం 6:10 నిమిషాల వరకు ప్రతిరోజు ఉపవాస దీక్షలలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6:10 నిముషాలకు ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇలా నెలరోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు ఉండి ప్రత్యేక నమాజులు జరుపుకుంటూ, పేదలకు తమ వంతు దానధర్మాలు చేస్తూ, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా కొలిచే గ్రంథమైన ఖురాన్ రంజాన్ నెలలోనే అవతరించిందని ముస్లింల యొక్క నమ్మకం. స్వర్గం నుంచి ఖురాన్ గ్రంధాన్ని అందించినందుకు, మహమ్మద్ ప్రవక్త యొక్క ఆచరణలు పాటిస్తూ సూర్యోదయం కంటే గంట ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్షలు ఉంటూ అల్లా కు కృతజ్ఞతలు తెలుపుతారు.
