మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:గులాబీ తుఫాన్ కారణంగా రాళ్లవానతో పంట దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రైతన్నకు నేనున్నానంటూ పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదలచేశారు. . ఇటీవల కురిసిన భారీ వడగండ్ల వాన వలన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లడంతో పాటు ఇల్లందు నియోజకవర్గంలో కూడా వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐదు మండలాలలో దెబ్బతిన్న పంటల గురించి క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి వివరాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, సీఎం కేసీఆర్ ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సాయం కింద ఇల్లందు నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ఐదు మండలాలలోని దాదాపు 3 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలకి పంటసాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దీంతో దాదాపు ఐదువందల మంది రైతు కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ఇప్పటికే పంట సాయం రైతుబంధు, రైతు బీమా కింద రైతులకు చేదోడు వాదోడుగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వం నేడు పంటనష్ట సహాయం కింద పట్టాదారు రైతులతోపాటు, కౌలు రైతన్నకు కూడా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం అనేది గొప్ప విషయమని ఎమ్మెల్యే హరిప్రియ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గత ప్రభుత్వాల హయాంలో ఏనాడూ ఇంతపెద్ద మొత్తంలో రైతన్నలకు ఆర్థికసాయం అందలేదని,సీఎం కేసీఆర్ రైతు బాందవుడని తెలిపారు. అంతేకాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా పంటసాయం కింద ఆర్థిక పరిహారాన్ని అందించాలని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ డిమాండ్ చేశారు.
