UPDATES  

 రాహులు గాంధీకి జైలు శిక్ష విధించడం రాజకీయ కుట్ర -జేష్ఠ సత్యనారాయణ.

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 24: పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష వేయడాన్ని తెలంగాణ పిసిసి సభ్యులు జ్యేష్ట సత్యనారాయణ చౌదరి తీవ్రంగా ఖండించారు. అశ్వారావుపేట లోని శుక్రవారం తన స్వగృహంలో కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యేష్ట సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ దేశంలో ఎన్నడూ లేని విధంగా బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయని, అన్ని వ్యవస్థల మీద అజమాయిషీ చేస్తూ న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించడం వెనుక రాజకీయ కుట్ర దాగుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలికంగా పరిపాలన కొనసాగించినప్పటికీ, అందరిని సమన్వయం చేసుకుంటూ సుపరిపాలన అందించారని, ఇటువంటి రాజకీయ కుట్రలు ఏనాడు చేయలేదని, ఇటువంటి కేసులలో జైలు శిక్ష వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ఇటువంటి కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విధంగా నిర్బంధం కొనసాగితే ఏ ఒక్క బీజేపీ కార్యకర్త కూడా రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని బిజెపి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు అన్ని గమనిస్తున్నారని, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని వారు దీమా వ్యక్తం చేశారు. అదే విదంగా తెలంగాణ ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి పదివేలు ప్రకటించడం హాస్యాస్పదం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నష్టపోయిన రైతాంగానికి పదివేలు నుండి పదిహేను వేలు సాయం అందించారని, అప్పటి ధరలకు ఇప్పుడు ధరలు పోల్చుకుంటే అనేక రెట్లు ధరలు పెరిగాయని, స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి పంటలు పరిశీలన చేసి పదివేలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని రైతులు పెదవి విరుస్తున్నారన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్, కేంద్రంలో బిజెపి దొందు దొందేనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వారు కార్యకర్తలకు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో సొసైటీ డైరెక్టర్ బత్తిని పార్థసారథి, అనంతారం సర్పంచ్ దాసరి నాగేంద్రరావు, కాంగ్రెస్ నాయకులు బండారి శ్రీనివాసరావు, మేక అమర్నాథ్, చిమడబోయిన సత్యనారాయణ, మొగిలి రాంబాబు, ఆకిరిపల్లి రాంబాబు, దొడ్డాకుల రమణ, అనిల్ కృష్ణ, తమ్మిశెట్టి పోషయ్య, గండేటి సీతారాం, వార్డు మెంబర్లు కాండ్రుకోట ఉదయ్ కుమార్, హలవత్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !