మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
10వ తరగతి విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షలను ఎటువంటి ఒత్తిడి లేకుండా రాయాలని, కష్టమనిపించిన సబ్జెక్టులలో సందేహాలను ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకొని ఆత్మస్థైర్యంతో పరీక్షలకు సన్నద్ధమవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో పదవ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే కరపత్రాలను ప్రతి విద్యార్థికి అందించుటకై ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్ష జీవన ప్రయాణంలో ముఖ్యంగా బాల్యంలో ఒక గొప్ప మలుపు అని, ఆ మలుపులో మీరు రాసే పరీక్ష ప్రశాంతంగా, విజయవంతంగా ముగించుకొని మరొక ఉన్నత విద్యా లోకంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. మీరే మీ తల్లిదండ్రులకు ఆస్తి, మీ తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను మీరు నిజం చేయాలని, అలాగే మీ కలలను సార్ధకం చేసుకోవాలని, ఇవన్నీ చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతి తేవాలని ఆశీర్వదించారు. విద్యార్థుల పరిపూర్ణ విజయం ద్వారా తన మాటను నిలబెడతారని ఆశిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్. మాధవరావు, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ కోఆర్డినేటర్ ఏ. నాగరాజు శేఖర్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్ కే సైదులు, సహాయ గణాంక అధికారి ఎన్ సతీష్ కుమార్, ఏ పీ ఓ కే కిరణ్తదితరులు కుమార్ పాల్గొన్నారు.