మన్యం న్యూస్, భద్రాచలం :
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమపాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికారమైన ఆహారం సమయానుకూలంగా అందించి, వచ్చే నెల మూడో తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు సిద్ధంగా ఉండేలా సంబంధిత ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు డిప్యూటీ వార్డెన్లు, ఉపాధ్యాయులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి అన్నారు. మంగళవారం భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రధానోపాధ్యాయులు, వార్డెన్, డిప్యూటీ వార్డెన్లోతో పదవ తరగతి నిర్వహణలపై ఏర్పాటుచేసిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమపాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు అందరూ పదో తరగతిలో 100% ఉత్తీర్ణత తో పాటు 10 బై 10 గ్రేడ్ రావాలని అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్లు, వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు,అడాప్ట్ టీచర్లు అందరూ స్థానికంగా ఉండి పిల్లలు యొక్క ఆరోగ్య పరిస్థితులు గమనిస్తూ పరీక్షలు బాగా రాసే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరీక్షా కేంద్రాలకు సకాలంలో వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వాతావరణం మార్పు, ఎండలు ముదురుతున్నందున ప్రతి పాఠశాలలో మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని, పిల్లలకి మెనూ ప్రకారం పౌష్టికారమైన ఆహారంతో పాటు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ పాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాలు దూరంగా ఉంటే రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని, పరీక్షలు కాగానే తిరిగి వారిని ఆయా పాఠశాలల్లో సురక్షితంగా చేరవేసి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను గమనించి ఎవరైనా పిల్లలు అస్వస్థతగా ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. ముఖ్యంగా సబ్జెక్ట్ టీచర్లు పిల్లలందరూ మీ యొక్క సబ్జెక్టు పట్ల ఏ విధంగా ఉన్నది తెలుసుకొని వారికి పరీక్షలు ఏ విధంగా రాయాలో తరిఫీదు ఇవ్వాలని, ప్రధానోపాధ్యాయుడు ,వార్డెన్ తప్పనిసరిగా పిల్లల చదువును గమనించి వారు పదవ తరగతి పరీక్షలు ధైర్యంగా రాసే విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. పదో తరగతి పరీక్షలు కాగానే ఆ విద్యార్థిని, విద్యార్థుల దగ్గర్నుండి పదవ తరగతి పుస్తకాలు తీసుకొని ప్రతి ఆశ్రమపాఠశాలలో బుక్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య, భద్రాచలం ఏ.టి.డి.వో నర్సింగరావు, దమ్మపేట ఏ.టి.డి.వో చంద్రమోహన్, ఇల్లందు ఏ.టి.డి.ఓ రూపాదేవి, అసిస్టెంట్ ఏసీఎంఓ భావ సింగ్, 40 పాఠశాలల హెచ్ఎంలు, వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.