- వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామివారి మహా పట్టాభిషేకం
- – హాజరైన గవర్నర్ తమిళసై, మంత్రి సత్యవతి రాథోడ్
- – ఉత్సవాలను తిలకించిన భక్తకోటి
మన్యం న్యూస్, భద్రాచలం :
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రుల మహా పట్టాభిషేకం వేడుక శుక్రవారం వైభవోపేతంగా జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు మిథిలా స్టేడియంలోని ఏర్పాటు చేసి ఉంచిన మహా సింహాసనం పై శ్రీ సీతారామ చంద్రులను ఆశీనులు గావించారు. శ్రీ సీతారాముల మహా పట్టాభిషేకం భక్తకోటి కనులారా తిలకించి తన్మయం చెందారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ తదితర ప్రముఖులు హాజరై స్వామివారి మహా పట్టాభిషేకాన్ని వీక్షించారు. మహా పట్టాభిషేకానికి విచ్చేసిన భక్తులకు కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుగానే చర్యలు తీసుకున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే శ్రీ స్వామివారి తిరు కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది జరిగిన శ్రీ సీతారామచంద్ర తిరు కళ్యాణోత్సవాలు వైభవోపేతంగా, కన్నుల పండుగగా నిర్వహించారు. మహా పట్టాభిషేకంలో ఆసీనులైవున్న శ్రీ సీతారామ చంద్రులకు భక్తులు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ జయ జయ ధ్వనాలు చేస్తూ పులకించిపోయారు. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను, శ్రీ సీతారామ చంద్రుల మహా పట్టాభిషేకం విశిష్టతను వివరిస్తూ మహా పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపించారు. మహా పట్టాభిషేకం ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ తమిళసై, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ హాజరవుతున్నందున పోలీసులు ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహా పట్టాభిషేకం వీక్షించేందుకు వచ్చిన భక్తులకు, ప్రముఖులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ చర్యలు తీసుకున్నారు.