- పంట నష్టం అంచనా తప్పులు ఉండొద్దు
- అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలపై సమగ్ర నివేదికను సమర్పించండి
- వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అనుదీప్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అకాల వర్షాలు, గాలి దుమారాల వల్ల దెబ్బతిన్న పంటలపై సమగ్ర నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం వరదల వల్ల జరిగిన పంట నష్టం గణన ప్రక్రియపై వ్యవసాయ, ఉద్యాన అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 16 నుంచి 21వ తేదీలలో వచ్చిన అకాల వర్షాలు, గాలి దుమారాల వల్ల పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం అందించేందుకు చేపడుతున్న గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లుకు తావు
లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. పంట నష్టపోయిన ప్రతి ఒక్కరైతుకు పరిహారం అందించేందుకుప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు గణన ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ప్రతి క్లస్టర్లో క్రాప్ బుకింగ్ చేసిన
ప్రకారం గణన ప్రక్రియ పక్కాగా చేపట్టాలని చెప్పారు. గణన ప్రక్రియపై వ్యవసాయ, ఉద్యాన అధికారులకు సమగ్రమైన అవగాహన ఉండాలన్నారు. పంటనష్టపోయిన కౌలు రైతులకు పరిహారం చెల్లించుట కొరకు చేపట్టిన ఈ గణన
ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేసి వ్యవసాయ విస్తరణ, మండల వ్యవసాయాధికారులతో పాటు సహాయ సంచాలకులు ఇచ్చిన నివేదికను వ్యవసాయ, ఉద్యాన అధికారులు ధృవీకరణ చేయాలని చెప్పారు. పరిహారం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నందున నష్టపోయిన రైతుల భూముల సర్వే నెంబరు, బ్యాంకు, ఐఎఫ్ఎస్సి, ఆధార్ నెంబరు, కుల వివరాలను నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో 2600 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక అంచనా
వేశారని, క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ నిర్వహించి జాబితా తయారు చేయాలన్నారు. బోగస్ నివేదికలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణన ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేకంగా విజిలెన్సు టీములను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గణన ప్రక్రియ నిర్వహణకు ప్రతి క్లస్టర్కు ప్రొఫార్మాను అందచేయడం జరిగిందన్నారు.
ఎంత విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లిందో పక్కాగా లెక్కలు వేయాలని చెప్పారు. నష్టం ఎక్కువగా జరిగిన
క్లస్టర్లులో గణన ప్రక్రియ పూర్తి చేయుటకు అనదపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు.
అనంతరం మండలాల్లో సర్వే ప్రక్రియ నిర్వహణ, పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి
మరియన్న, ఏడిలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.