మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ వెంజటేశ్వర్లు పిలుపునిచ్చారు. అదివారం
బీ.సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని కొత్తగూడెం. పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలలో ఆయన పాల్గొని పాపన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి అనుసరణీయమని పేర్కొన్నారు. మహనీయుల త్యాగ నిరతి నేటి తరాల వారు తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
పోరాట యోధుడు పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ పోరాట తెగువ అసామాన్యమైనదని కొనియాడారు. మొఘల్ రాజుల కాలంలో దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న అన్నారు. పాపన్న గౌడ్ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసమాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మంది సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను అందించారని పేర్కొన్నారు. గోల్కొండ కోటను సైతం జయించి, జనరంజకంగా పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అందరూ సమానులేననే భావన పెంపొందేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి సురేందర్, ఎక్సైజ్ఈఎస్ జానయ్య, బిసి సంగ నాయకులు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.