మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:కేంద్రం సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం నుంచి మినహాయించి సింగరేణికే తిరిగి ఇవ్వాలని కోరుతూ శనివారంనాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు మహాధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఎస్.రంగనాథ్ తెలిపారు. భద్రాద్రి జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ చీఫ్ విప్ రేగ కాంతారావు అధ్యక్షతన జరిగే ఈ మహాధర్నాకు ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ లు పాల్గొంటారని పేర్కొన్నారు. సింగరేణి ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం కొత్తగూడెంలో జరగబోయే మహాధర్నాకు ఇల్లందు నుండి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే వారితో పాటు టీబీజీకేఎస్ అన్ని స్థాయిల కమిటీల సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని ఉదయం 7.30 గంటలకు టీబీజీకేఎస్ కార్యాలయం నుంచి కొత్తగూడెం వెళ్లుటకు రావాలని, హెడ్ ఆఫీస్ ముందు జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు రంగనాథ్ పిలుపునిచ్చారు. సెంట్రల్ కమిటీ, జీఎం కమిటీ, బ్రాంచ్ కమిటీ, పిట్ కమిటీ, మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ, క్యాంటీన్ కమిటీ, క్లబ్ కమిటీ నాయకులు, మరియు డెలిగట్లు అందరూ కొత్తగూడెం వెళ్ళుటకు సకాలంలో రావాలని కోరారు. కేంద్రప్రభుత్వం ఇకనైనా ఈ వైఖరిని మార్చుకొని బొగ్గు బావుల ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో సింగరేణిలో అన్ని ప్రాంతాలను కలుపుకొని జంక్ సైరన్ సమ్మె చేసేందుకు సైతం సిద్దమని హెచ్చరించారు.