మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని గౌతం పూర్ పంచాయతికి జాతీయస్థాయిలో హెల్ది పంచాయతి అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. 9 అంశాలలో అవార్డులు ఎంపిక ప్రక్రియ జరిగిందని, వాటిలో హెల్ది పంచాయతి విభాగంలో గౌతంపూర్ పంచాయతీకి జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించినట్లు తెలిపారు. పంచాయతీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, పచ్చదనం పెంపొందించుటకు చేపట్టిన చర్యలు, మురుగునీరు నిర్వహణ తదితర అంశాలపై చేసిన కృషికి జాతీయ స్థాయిలో లభించిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. వ్యర్థాలు, వ్యాధులు నుంచి స్వచ్ఛత కొరకు చేసిన నిరంతర కృషి ఫలితంగా నేడు మన జిల్లాకు జాతీయ స్థాయిలో హెల్ది పంచాయతి విభాగంలో మొదటి స్థానం వచ్చినట్లు చెప్పారు. ఇదే కృషితో మన జిల్లాను అభివృద్ధి లో రోల్ మోడల్ గా తయారు చేయాలని చెప్పారు. ఈ అవార్డు సాధించడం మనందరి పనితనానికి లభించిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. అవార్డు సాధనకు కృషి చేసిన సర్పంచ్ పోడియం సుజాత, కార్యదర్శి జక్కంపూడి షర్మిళ, డిపిఓ రమాకాంత్ , డిఆర్డీఓ మధుసూదన్ రాజు, జడ్పి సీఈఓ విద్యాలత, ఎంపీడీఓ రమేష్, ఎంపిఓ సత్యనారాయణ తదితరులను ప్రత్యేకంగా అభినందించారు.