- గాండ్లగూడెం గ్రామంలో ప్రగతి శీల యువజన, మహిళా సంఘాలు ప్రజల సంతకాల సేకరణ
- రేషన్ షాపుల్లో 12 రకాల వస్తువులను పంపిణీ చేయాలి, నిత్యావసరాల సరుకులు పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలి
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్ 08: ప్రగతి శీల యువజన సంఘం (పివైఎల్) ప్రగతి శీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) ఆధ్వర్యంలో శనివారం అశ్వారావుపేట మండలం గాండ్లగూడె గ్రామంలో ప్రజల సంతకాల సేకరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న పివైఎల్ జిల్లా అధ్యక్షుడు వాసం బుచ్చిరాజు మాట్లాడుతూ పేద ప్రజలకు నిత్యావసరాల ధరలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా (రేషన్ షాపుల ద్వారా) 12 రకాల సరుకులు ఉచితంగా సరఫరా చేయాలని. కేంద్ర ప్రభుత్వం 5 కేజీలు బియ్యం రాష్ట్ర ప్రభుత్వం 5 కేజీలు బియ్యం కలిపి మొత్తం 10 కేజీలు సన్న బియ్యం ఇవ్వాలని, వాటితో పాటు వంట నూనె, కంది పప్పు, పెసర పప్పు, గోధుమ పిండి, పంచదార, టీ పోడి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, పల్లీలు, సబ్బులు, కోబ్బరి నూనె తదితర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయాలని, రేషన్ కార్డులు కోసం దరఖాస్తులు పెట్టుకొని నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు ఇవ్వకపోగా, గతంలో రేషన్ షాపుల ద్వారా ఇస్తన్నటువంటి తొమ్మిది రకాల వస్తువులు సరుకులను ఇవ్వకపోవడం సిగ్గు చేటు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్క పేదవాడికి 12 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా సరఫరా చేయాలని వంట గ్యాస్ సిలిండర్ల సగం సబ్సిడితో ఇవ్వాలని అలాగే తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది రేషన్ కార్డుల కోసం అన్ లైన్ చేసుకున్నారని వారందరికీ తక్షణమే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించిందని, దీన్ని చూసి పేదలకు భూములు, ఇళ్ళు స్థలాలు, డబల్ బెడ్ రూమ్ కొలువులు, రేషన్ కార్డులు తదితర సమస్యలు పోతాయని ప్రజలు ఆశించారన్నారు. బిజెపి, బిఆర్ ఎస్ ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలను రోజు రోజుకు పెంచుతున్నారని, 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ల ధర నేడు 1200 రూపాయలకు పైగా పెరిగిందని అన్నారు. ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎట్లావండాలో ఏం తినాలో అర్ధంకాని స్థితి. దీనితో మహిళలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అచ్చేదిన్ అని ఒకరంటే బంగారు తెలంగాణ అంటూ మరొకరు తెగ బాకాలూదుతున్నారు. కానీ ప్రజలకు ఆహార భద్రత కల్పించే ప్రణాళికలు లేవు, పైగా ప్రజాపంపిణీ వ్యవస్థను నీరుగార్చే వైపుగా పాలకుల విధానాలున్నాయి అని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో గాండ్లగూడెం గ్రామస్తులు సహకరిస్తు పాల్గొన్నారు.